Calcutta HC Transfer Doctor Case To CBI : బంగాల్లో పీజీటీ డాక్టర్ హత్యాచారం కేసు విచారణను విషయంలో కలకత్తా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేయాలని పోలీసులను ఆదేశించింది. మంగళవారం సాయంత్రంలోపు కేసు డైరీని, బుధవారం ఉదయం 10 గంటలలోపు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, సీసీటీవీ ఫుటేజీ సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సందీప్ ఘోష్‌ను ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా తిరిగి నియమించరాదని హైకోర్టు పేర్కొంది.
కాగా, డాక్టర్లు నిర్వర్తించేది గౌరవమైన బాధ్యత అని, నిరసనలు ఆపాలని వైద్యులను కోరింది. హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా విధులను వైద్య సిబ్బంది బహిష్కరించిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.
ఎమర్జెన్సీ సేవలు బంద్!
అంతకుముందు, హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా విధులను వైద్య సిబ్బంది బహిష్కరించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో కోల్‌కతా ఘటనను చరిత్రలో దారుణ ఘటనగా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్- ఫోర్డా తెలిపింది. డ్యూటీలో ఉన్న వైద్యురాలి మాన ప్రాణాలను కాపాడలేని మెడికల్ కాలేజీ అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నిరసనలు చేస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోబోమని, కేసులో సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని వైద్య సంఘం కోరింది. వైద్యుల భద్రత కోసం కేంద్రం వెంటనే సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను అమలు చేయాలని డిమాండ్ చేసింది.
మరోవైపు, వైద్యులపై హింసను అరికట్టేందుకు, ఆస్పత్రుల్ని సేఫ్‌జోన్లుగా ప్రకటించాలని IMA నడ్డాకు లేఖ రాసింది. 25 రాష్ట్రాలు వైద్యులపై దాడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టాలు చేసినా క్షేత్రస్థాయిలో అవి క్రియాశీలకంగా లేవని, కేంద్రం ప్రత్యేక చట్టం చేయకపోవడం అందుకు కారణమని లేఖలో వివరించింది.
వెలుగులోకి కీలక వివరాలు!
హత్యాచార ఘటనలో మరిన్ని దారుణ విషయాలు తెలిశాయి. నిందితుడిని నుంచి తప్పించుకునే యత్నంలో జరిగిన పెనుగులాటలో ఆమె గొంతు భాగంలోని థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిందని పోస్టుమార్టంలో వెల్లడైంది. ఆగస్టు 9న తెల్లవారుజామున 3నుంచి 5 గంటల మధ్యలో ఘటన జరిగినట్లు సమాచారం. ఉదరం, పెదాలు, వేళ్లు, ఎడమకాలుకు గాయాలున్నాయనీ కేకలు వినిపించకండా ఆమె తలను గోడకు అదిమిపట్టి ముక్కు, నోరు మూసివేసినట్లు వెల్లడైంది. ఆమె ముఖమంతా గోటి గాయాలయ్యాయి.