Budget Session Of Parliament Begins Today : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం (మోదీ సర్కార్ 3.0) మూడోసారి కొలువుదీరిన తర్వాత, తొలిసారి బడ్జెట్‌ను సమర్పించేందుకు పార్లమెంటు సోమవారం నుంచి సమావేశం కాబోతోంది. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.
సోమవారం (జులై 22) నాడు పార్లమెంట్ ముందు భారత ఆర్థిక సర్వే 2023-24ను ఉంచనున్నారు. మంగళవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన 2024 బడ్జెట్ కూడా జూలై 23నే పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. మొత్తంగా ఈ పార్లమెంట్ సెషన్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 6 బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది.
అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైన విపక్షాలు!
మరోవైపు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, రైల్వే భద్రత, కావడి (కన్వర్) యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అంతేకాదు సంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కచ్చితంగా కేటాయించాలని ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాల కార్యాచరణపై చర్చించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం దీనిని నిర్వహించింది.
గళం వినిపించే అవకాశమివ్వండి
ఒక్కో సభ్యుడు ఉన్న పార్టీలు సహా, ఈసారి అందరినీ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. దీనితో 44 పార్టీల నుంచి 55 మంది నేతలు హాజరై తమ డిమాండ్లు వినిపించారు. పార్లమెంట్‌లో తమకు గొంతు వినిపించే అవకాశం ఇస్తామన్న భరోసా కల్పించాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదా కల్పించాలని వైసీపీ, జేడీయూ, బిజద నేతలు డిమాండ్ చేశారు. ‘కావడి యాత్ర’ అంశాన్ని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కీలకమైన 24 శాఖలకు సంబంధించి స్థాయీ సంఘాలను ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. మంత్రులతో ఎంపీలు నేరుగా చర్చించేందుకు వీలుగా, సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలని కోరారు. ప్రజలందరికీ ఉచితంగా ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రైవేటు మెంబర్ బిల్లును కూడా పరిగణనలో తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతోపాటు ఉన్నత న్యాయస్థానాల విశ్రాంత న్యాయమూర్తులు రాజకీయాల్లోకి రావడం, కృత్రిమ మేధ, డీప్‌ఫేక్, పౌరసత్వ సవరణ చట్టాలు లాంటి 23 బిల్లుల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. సమావేశం అయిన తరువాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. ఎలాంటి చర్చకైనా మోదీ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు అఖిలపక్ష సమావేశం జరుగుతుండగా వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న జైరాం రమేశ్‌ను, భాజపా ఐటీ విభాగాధిపతి మాలవీయ తీవ్రంగా తప్పుబట్టారు.
'దేశానికి ఇన్ఫెర్టిలిటీ ముప్పు- జనాభా సమీకరణాలు మారిపోయే ఛాన్స్!' - Infertility Crisis In India