Boy Saved Brother From Leopard : జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఓ 12 ఏళ్ల బాలుడు తన ధైర్యసాహసాలతో తన తమ్ముడిని చిరుతపులి బారి నుంచి ప్రాణాలతో కాపాడాడు. క్రికెట్ ఆడుతుండగా దూసుకొచ్చిన చిరుతను తన దగ్గర ఉన్న బాల్‌తో పారిపోయేలా చేశాడు. చిరుత కంటిపై గురిచూసి కొట్టి తన తమ్ముడిని కాపాడాడు. అసలేం జరిగిందంటే?
చిరుత దృష్టిను అలా మళ్లించి!
నాలుగో తరగతి చదువుతున్న అకిబ్ జావేద్ సోమవారం సాయంత్రం తన ఇంటి సమీపంలో తన తమ్ముడితోపాటు మరికొందరు స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా అకిబ్ తమ్ముడిపై చిరుతపులి దూసుకొచ్చింది. అది చూసిన అకిబ్ తన జేబులో ఉన్న క్రికెట్ బాల్‌ను చిరుతపులి కంటిపై విసిరాడు. తన తమ్ముడిపై ఉన్న చిరుత దృష్టిని మళ్లించాడు.
షాక్‌లో అకిబ్
ఆ తర్వాత అకిబ్ స్నేహితుడు ఇటుకను తీసుకొచ్చి చిరుతపైకి విసిరాడు. గట్టిగా చిరుత చిరుత అంటూ అరిచారు. వెంటనే గ్రామస్థులంతా అక్కడికి చేరుకున్నారు. అంతా కలిపి చిరుతను చెదరగొట్టారు. బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల కొన్ని గంటల తర్వాత తీసుకెళ్లారు. కానీ అకిబ్ ఇంకా అదే షాక్‌లో ఉన్నాడు. చిరుతను గుర్తుతెచ్చుకుంటూ భయభ్రాంతులకు గురవుతున్నాడు.
'చాలా భయపడ్డాను'
"మేం ఆడుకుంటూ ఉండగా మా ఇంటి సమీపంలో ఏదో జంతువు వస్తున్నట్లు అనిపించింది. వెంటనే చూడగా చిరుత నా తమ్ముడిపైకి దూసుకొచ్చింది. నా దగ్గర ఉన్న బాల్‌ను విసిరాను. ఫ్రెండ్స్ కూడా సహాయం చేశారు. ఇటీవల మా ఊర్లో ఓ బాలిక చిరుతపులి దాడిలో చనిపోయింది. వెంటనే ఆ విషయం గుర్తొచ్చింది. బాగా భయపడ్డాను. కానీ నా తమ్ముడిని కాపాడుకున్నాను" అని అకిబ్ తెలిపాడు.
అకిబ్ ధైర్యానికి ప్రశంసలు
అయితే గ్రామంలో తాము ఇళ్ల నుంచి బయటకు రావడానికి చాలా భయపడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. ఏ సమయంలో చిరుతలు వస్తన్నాయో తెలియడంలేదని చెప్పారు. కనీస సౌకర్యాలు కూడా లేవని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని వసతులు కల్పించాలని కోరారు. అకిబ్ ధైర్యాన్ని ప్రశంసించారు. సాయంత్రం వేళ ఎక్కువగా జంతువులు నివాస ప్రాంతాల్లోకి వచేస్తున్నాయని చెప్పారు.
రూంలోకి సడెన్‌గా చిరుత- తెలివిగా బంధించిన బాలుడు- ధైర్యానికి హ్యాట్సాఫ్!