Blind Musician in Maharashtra : మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన నందకిషోర్ బాలాజీ ఘాలే, పుట్టిన కొన్ని నెలలకే చూపు కోల్పోయినా ఫ్లూట్, తబలా, హార్మోనియం అద్భుతంగా వాయిస్తున్నారు. మంచి గాయకుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు. వివిధ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ వృద్ధ కళాకారుడు.
'నేను పుట్టిన ఆరు నెలల వరకు కళ్లు బాగానే కనిపించాయి. ఆ తర్వాత ఒక్కసారిగా చూడలేకపోతున్నానని మా నాన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ చెక్ చేసి నాకు ఇంకా ఎప్పటికీ కళ్లు కనిపించవు అని చెప్పారు'
- నంద కిషోర్, సంగీత కళాకారుడు
రైతు కుటుంబలో జన్మించిన నంద కిషోర్ అంధత్వం కారణంగా చదువుకోలేకపోయారు. దీంతో ఇంట్లోనే ఉండి రేడియోలో వచ్చే పాటలను వింటూ ఫ్లూట్ వాయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఫ్లూట్తో పాటు తబలా, హార్మోనియం వాయిస్తూ మంచి సంగీత కళాకారుడిగా గుర్తింపు పొందారు.
'నాకు పాడటం అంటే చాలా ఇష్టం. రేడియోలో శాస్త్రీయ సంగీతాన్ని వింటూ అర్థం చేసుకుని నేను మనసులో పాడుకుంటూ ఉండేవాడిని. పెళ్లి తర్వాత నేను బల్భీమ్ జాదవ్ అనే గురువును కలిశాను. అప్పడే పాడటం అంటే ఏంటో అర్ధమైంది. అలా అన్నీ వింటూ వాయిద్యాలు వాయించడం, సంగీతం నేర్చుకున్నాను'
- నంద కిషోర్, సంగీత కళాకారుడు
చుట్టు పక్కగ్రామాలతో పాటు ముంబయి, పుణె వంటి నగారాలకు వెళ్లి వివిధ కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తుంటారు నంద కిషోర్. అలా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. అన్ని వేళల భార్య లత తనకు తోడుగా ఉంటోందని, ఆమె తనకు రెండు కళ్లు అని చెబుతున్నారు నందకిషోర్.
'నేను ఈ ప్రపంచాన్ని వినడం ద్వారా మాత్రమే చూస్తాను. ఎవరినీ చూడలేను. కానీ మాట్లాడిన మాటలు చెవి నుంచి గుండెకు తాకుతాయి. నేను అంధుడైనప్పటికీ నా భార్య నన్ను పెళ్లి చేసుకుంది. అందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఆమె నాకు అమ్మా. నన్ను కన్నబిడ్డలా చూసుకుంది. ఆమే నాకు రెండు కళ్లు'
- నంద కిషోర్, సంగీత కళాకారుడు
తండ్రి నందకిషర్ను ఆయన కుమారుడు ప్రవీణ్ స్ఫూర్తిగా తీసుకున్నారు. పట్టుదలతో సంగీతాన్ని నేర్చుకుని ప్రదర్శనలిస్తున్నారు.