BJP White Paper : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని సంక్షోభాలను అధిగమిస్తూ దేశ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని ఆర్థికమంత్రి లోక్సభలో ప్రవేశపెట్టారు. 2004 నుంచి 2014 వరకు సాగిన యూపీఏ పాలనలో ఆర్థిక దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. ఆ పదేళ్ల పాలనలోని సంక్షోభాలను అధిగమించి దేశ ఆర్థిక వ్యవస్థ సర్వతోముఖాభివృద్ధి, స్థిరమైన వృద్ధి చెందే సంస్కరణలను తీసుకొచ్చామని వివరించారు.
2014లో మన ఆర్థిక వ్యవస్థ ఎక్కడుందో, ఇప్పుడు ఎక్కడ ఉందో చూడాలని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆ పదేళ్ల పాలనలోని లోపాల నుంచి పాఠాలు నేర్చుకుని ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేశామని తెలిపారు. తాము విడుదల చేసిన శ్వేతపత్రం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతుందని చెప్పారు. రాజకీయ, విధాన స్థిరత్వంతో ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాల కోసం కఠినమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని వివరించారు. పదేళ్ల పాలనలో యూపీఏ ప్రభుత్వం విడిచిపెట్టిన సవాళ్లను ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా అధిగమించిందని అన్నారు.
'యూపీఏ వల్ల దేశం అపఖ్యాతి పాలయ్యింది!'
ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో యూపీఏ సర్కార్ ఘోరంగా విఫలమైందని శ్వేతపత్రంలో కేంద్రం పేర్కొంది. యూపీఏ హయాంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునాదులను ఎన్డీఏ పాలనలో పునర్ నిర్మించామని కేంద్ర ఆర్థికమంత్రి శ్వేతపత్రంలో వివరించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాలు, భారీ ఆర్థిక నష్టాలకు దేశ అపఖ్యాతికి కారణమయ్యాయని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ గమ్యం అని, ఆ ప్రయాణంలో ఇంకా మైళ్ల దూరం వెళ్లాలని, పర్వతాలు అధిరోహించాలని అన్నారు.
'దేశం పదేళ్లు వెనక్కి వెళ్లింది'
యూపీఏ ఆర్థిక నిర్వహణ లోపం కారణంగా దేశం పదేళ్లు వెనక్కి వెళ్లిందని బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి అన్నారు. వారు ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుతున్నారని, కానీ వారు పాలించిన 50 సంవత్సరాలలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అందుకో మా ప్రభుత్వం చేసిన పనులు చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మధ్యతరగతికి గూడు- యథాతథంగా పన్నులు- తాయిలాలు లేకుండా మధ్యంతర బడ్జెట్
'అసమానతలు లేని భారత్ మా లక్ష్యం- 2047 నాటికి పేదరికం కనబడదు!'