BJP Seats Dipped in Rajyasabha : రాజ్యసభలో అధికార బీజేపీకి సంఖ్యాబలం తగ్గింది. ఎగువసభలో నలుగురు నామినేటెడ్ సభ్యులు గత శనివారం పదవీవిరమణ చేయడం వల్ల, బీజేపీ ఎంపీల సంఖ్య 86కు పడిపోయింది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్‌తో పాటు మరికొన్ని కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న నేపథ్యంలో పెద్దల సభలో అధికార ఎన్డీఏ సంఖ్యాబలం తగ్గడం గమనార్హం.
రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేశ్ జఠ్మలానీ పదవీకాలం పూర్తయినందున గతవారం పదవీ విరమణ చేశారు. వీరిని నాన్ అలైన్డ్ సభ్యులుగా రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ ఆ తర్వాత మోదీ ప్రభుత్వానికి అధికారికంగా మద్దతు ప్రకటించారు. వీరి పదవీకాలం పూర్తవడం వల్ల ఇప్పుడు బీజేపీ సంఖ్యాబలం 86కు పడిపోగా, NDA కూటమికి బలం 101గా చేరింది. అటు ఇండియా కూటమికి 87మంది సభ్యుల మద్దతు ఉంది.
245మంది సభ్యులుండే రాజ్యసభలో ప్రస్తుతం 19 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం సభ్యుల సంఖ్య 226కు చేరింది. మెజార్టీ మార్క్ అయిన 114 కంటే ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యాబలం తక్కువగా ఉంది. ఏడుగురు నామినేటెడ్, ఇద్దరు స్వతంత్రుల మద్దతు అధికార పక్షానికి ఉన్నప్పటికీ వారితో కలిపినా మెజార్టీ మార్క్ దాటదు.
అధికార పార్టీకి సంఖ్యాబలం తగ్గడం వల్ల, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులపై ఓటింగ్ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో బిజు జనతాదళ్, బీఆర్ఎస్ వంటి తటస్థ పార్టీలు కీలకంగా మారనున్నాయి. బిల్లులను ఆమోదించుకోవాలంటే స్వతంత్రులతో పాటు తటస్థ పార్టీల మద్దతు కేంద్రానికి అవసరం. రాజ్యసభలో బిజు జనతాదళ్ పార్టీకి 9మంది ఎంపీలుండగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వీరు ప్రతిపక్షం వైపు కూర్చోవడం గమనార్హం. అయితే, అన్నాడీఎంకే, వైకాపా మద్దతుతో బీజేపీ నెగ్గే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యసభలో వైకాపాకు 11, అన్నాడీఎంకేకు నలుగురు ఎంపీలు ఉన్నారు.
రాజ్యసభలో 19 ఖాళీల్లో నాలుగు జమ్ముకశ్మీర్ నుంచి, నాలుగు నామినేటెడ్ కేటగిరీలో ఉన్నాయి. మరో 8 రాష్ట్రాల నుంచి 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందులో ఎన్డీఏకు 8, ఇండియా కూటమికి మూడు స్థానాలు దక్కుతాయి.