BJP Leader Devaraje Gowda arrested : ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారంలో ప్రజావేగుగా నిలిచిన బీజేపీ నేత దేవరాజే గౌడ అరెస్ట్ అయ్యారు. శుక్రవారం రాత్రి గులిహల్ టోల్ గేట్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేశారు. దేవరాజే తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ కేసు
బీజేపీకి చెందిన దేవరాజే గౌడ ఓ న్యాయవాది. ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం బయటకు వచ్చిన సమయంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. హాసన్ జిల్లాకు చెందిన ఓ మహిళ (36) తనను దేవరాజే మోసం చేశారంటూ ఏప్రిల్ 1న హోలెనరసీపుర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఆస్తిని విక్రయించడంలో సాయం చేస్తాననే నెపంతో తనను వేధించాడని అందులో ఆరోపణలు చేశారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాసన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి హాసన్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో హిర్యుర్ పోలీసులు, ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న దేవరాజే గౌడను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం హాసన్ పోలీసులకు అప్పగించారు.
కాగా, జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికే ముందే, ప్రజ్వల్ దారుణాల గురించి బీజేపీ అధిష్ఠానాన్ని దేవరాజే గౌడ అప్రమత్తం చేసినట్లు ఇటీవలే తెలిసింది.
మరోవైపు, ఇటీవల ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రజ్వల్, ఆ వీడియోలు వెలుగు చూసిన తర్వాత విదేశాలకు పరారయ్యారు. ఆయనపై ఇంటర్ పోల్ ద్వారా బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రజ్వల్‌పై అత్యాచారం, వేధింపులు, బెదిరింపులు తదితర సెక్షన్ల కింద పోలీసులు 3 FIRలు నమోదు చేశారు. అయితే వీడియోలు లీక్ చేసింది బీజేపీ నేత దేవరాజే గౌడనే అని ఆరోపణలు వచ్చాయి. వాటిని దేవరాజే గౌడ తోసిపుచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హోలెనరసిపుర స్థానంలో ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై దేవరాజే గౌడ పోటీ చేశారు. ఈ కేసులో హెచ్‌డీ రేవణ్ణను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.