Bilkis Bano Convicts Surrender : బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులు జైలులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడానికి ముందు ఆదివారం రాత్రి గుజరాత్‌లోని గోద్రా సబ్ జైలులో లొంగిపోయారని స్థానిక క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎన్ఎల్ దేశాయ్ తెలిపారు. జనవరి 21 అర్ధరాత్రి 12 లోపు జైలులో లొంగిపోవాలని వీరికి న్యాయస్థానం గడువు విధించిందని చెప్పారు.
2002 నాటి గోద్రా అల్లర్లకు సంబంధించిన కేసులో 11 మందికి 2008లో యావజ్జీవ శిక్ష పడింది. వారి శిక్షాకాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ్గించడం వల్ల 2022లో విడుదలయ్యారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఈనెల 8న సుప్రీంకోర్టు కొట్టివేసింది. దోషులంతా 2 వారాల్లోపు లొంగిపోవాలని ఆదేశించింది. లొంగిపోవడానికి తమకు సమయం కావాలంటూ దోషులు చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించింది.
దోషులకు శిక్ష తగ్గింపును రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పులో గుజరాత్ సర్కారుపై తీవ్రంగా మండిపడింది సుప్రీంకోర్టు. వారి శిక్ష తగ్గింపు విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి ఉండదని స్పష్టం చేసింది. దోషికి సంబంధించిన విచారణ ఎక్కడ జరిగిందో, అక్కడే శిక్ష తగ్గింపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ కేసుపై మహారాష్ట్రలో విచారణ జరగ్గా, ఆ ప్రభుత్వానికే శిక్ష తగ్గింపు అధికారం ఉంటుందని తెలిపింది.
కాగా, క్షమాభిక్ష నిర్ణయంపై పునరాలోచనల చేయాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలు చెల్లవని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. వాస్తవాలను దాచిపెట్టి, మోసపూరితంగా ఆ ఆదేశాలు సంపాదించుకున్నారని గుజరాత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకంగా ఉందని వెల్లడించింది. దోషులకు శిక్ష తగ్గింపు ఉత్తర్వులను బుద్ధి ఉపయోగించకుండానే జారీ చేశారని మండిపడింది.
ఇదీ వివాదం
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో 21ఏళ్ల బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది. ఐదు నెలల గర్భిణీ అయిన ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. అల్లర్లలో మూడేళ్ల కుమార్తె సహా బిల్కిస్ కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అత్యాచార కేసులో దోషులుగా తేలిన 11 మందికి జీవితఖైదు శిక్ష విధించారు. కాగా, గుజరాత్ ప్రభుత్వం వారిని 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. శిక్ష తగ్గింపు ప్రసాదించి వారిని ఆగస్టు 15న రిలీజ్ చేసింది.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. కేసు తీవ్రతను పట్టించుకోకుండా 11 మంది దోషులకు శిక్ష తగ్గించడాన్ని తప్పుబట్టింది. శిక్ష తగ్గింపుపై నిర్ణయం తీసుకునే ముందు దోషుల నేర తీవ్రతను పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ఆలోచించాల్సిందని అభిప్రాయపడింది.