Bihar Speaker No Confidence Motion : బిహార్‌లో కొలువుదీరిన ఎన్డీఏ సర్కారు బలనిరూపణ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న ఆర్జేడీ నేత అవధ్ బిహారీ చౌదరిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ యాదవ్ అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు. తీర్మానంపై నందకిశోర్‌తో పాటు బిహార్ మాజీ సీఎం జీతన్‌రామ్ మాంఝీ, మాజీ డిప్యూటీ సీఎం తారాకిశోర్ ప్రసాద్, జేడీయూ ఎమ్మెల్యే వినయ్ కుమార్ చౌదరి సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
స్పీకర్ రాజీనామా చేయకపోతే, ఆయన్ను తొలగించే ప్రక్రియను అసెంబ్లీ చేపడుతుంది. ఓటింగ్ నిర్వహించి స్పీకర్ తొలగింపు ప్రక్రియపై సభ్యుల అభిప్రాయం కోరతారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమిదే పైచేయిగా ఉంది. 243 స్థానాల అసెంబ్లీలో 128 సీట్లు ఎన్డీయేకే ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీల మహా కూటమికి 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. క్రాస్ ఓటింగ్ జరగకపోతే స్పీకర్ తొలగింపు ఖాయమే అని స్పష్టంగా తెలుస్తోంది.
స్పీకర్ తొలగింపు ఎందుకంటే?
ఆర్జేడీ నుంచి గెలిచిన అవధ్ బిహారీ చౌదరి జేడీయూ-కాంగ్రెస్-ఆర్జేడీ మహా కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన్ను కొనసాగిస్తే ఎన్డీఏ సర్కారుకు సభలో ఇబ్బందులు తప్పవు. జేడీయూలో చీలిక వస్తుందని ఆర్జేడీ పదేపదే చెబుతూ వస్తోంది. అలా జరిగే పక్షంలో స్పీకర్ పోషించే పాత్ర కీలకం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కారు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది.
తొలి కేబినెట్ మీటింగ్- అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే?
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నీతీశ్ కుమార్ తన తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ కార్యక్రమాల నిర్వహణపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నామని సీఎం నీతీశ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఫిబ్రవరి 29 వరకు సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. ఫిబ్రవరి 6న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
'ఇదీ మూన్నాళ్ల ముచ్చటే-ఎన్నికల వరకు కూడా కష్టమే!' బిహార్ పాలిటిక్స్‌పై పీకే సంచలన వ్యాఖ్యలు
జేడీయూ చేరిక NDAకు లాభమేనా? 40 సీట్లు క్లీన్‌స్వీప్ చేస్తారా?