Bihar Man Contested 15 Times In Elections : బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి 15 సార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో ఏకంగా 13 సార్లు ఓడిపోయాడు. అయినాసరే ఏమాత్రం వెనడుగు వేయలేదు. నిరాశకు లోనవ్వలేదు. ప్రజాసేవే ధ్యేయంగా ఈసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. త్వరలో జరగబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఆయన పట్టుదల వెనకున్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నాయకుడే కాదు కరాటే మాస్టర్ కూడా!
బిహార్ ముజఫర్‌పుర్ జిల్లాలోని మిల్కీ కజిచక్కు చెందిన డాక్టర్ నబీ హసన్ వృత్తి రీత్యా ఇంటీరియర్ డిజైనర్. అంతేకాకుండా పిల్లలకు కరాటేలో శిక్షణ కూడా ఇస్తారు. అలా ఇప్పటివరకు దేశవిదేశాల్లో అనేకమందికి కరాటే నేర్పించారు. నేపాల్, భూటాన్‌తోపాటు మన దేశంలోని వివిధ ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు కరాటేలో శిక్షణ ఇస్తుంటారు నబీ. అయితే ఇంటీరియర్ డిజైన్, కరాటే కాకుండా నబీకి సామాజిక సేవ చేయాలనే ఆసక్తి కూడా ఉండేది. అలా 2006లో గ్రామ ప్రజల సలహా మేరకు తొలిసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తన ప్రజాజీవితం ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెబుతున్నారు డాక్టర్ నబీ హసన్. మొదటి విజయం తర్వాత తనపై సామాజిక బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంచాయతీ స్థాయిలో మొత్తం కలిపి ఇప్పటిదాకా 15 సార్లు పోటీ చేసిన నబీ హసన్ 13 సార్లు ఓటమి పాలయ్యాడు. ఇందులో రెండుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు అసెంబ్లీకి పోటీ పడగా మిగతా 11 సార్లు పంచాయతీ స్థాయిలో జరిగిన వివిధ ఎన్నికలకు పోటీ చేశారు. అయితే పోటీ చేసే ప్రతిసారీ నబీ హసన్ స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్ దాఖలు చేసేవారు. ఇక ఆయన రెండుసార్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు.
తొలి విజయం ఇచ్చిన ఉత్సాహంతో
తొలి విజయం ఇచ్చిన ఉత్సాహంతో మిగతా ఎన్నికల్లో పోటీ చేశాడు నబీ. 11సార్లు పంచాయతీ స్థాయి ఎన్నికల్లో పోటీ చేసిన అతడు 7సార్లు కౌన్సిలర్, ఒకసారి ఛైర్మన్, ఒకసారి డిప్యూటీ ఛైర్మన్, ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. 2018లో కౌన్సిలర్ ఎన్నికల్లోనూ గెలుపొందారు. ఇక 2010, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో నబీ హసన్‌కు 22,455 ఓట్లు వచ్చాయి.
జైలు నుంచి వచ్చాకా పోటీ!
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నబీ హసన్ కౌన్సిలర్‌గా ఉన్నారు. ఇక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రచారంలో కొందరు గ్రామస్థులు గొడవకు దిగారు. దీంతో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ కొందరు నబీపై కోర్టులో కేసు వేశారు. దీంతో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అలా దాదాపు 70 రోజులు జైలులో గడిపాడు నబీ. ఇక బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
16వ సారి ఎన్నికల బరిలోకి
ప్రస్తుతం నబీ 16వ సారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు నబీ హసన్. వైశాలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తానని 'ఈటీవీ భారత్'తో చెప్పారు. మరి ఆయన రాజకీయ భవితవ్యం తెలియాలంటే జూన్ 4వరకు వేచిచూడాల్సిందే.