Girl Molested In Train : బిహార్‌లో ఎక్స్‌ప్రెస్ రైలులో 11 ఏళ్ల బాలికపై ఓ రైల్వే ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా, చిన్నారిని వేధింపులకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు అతడిని చితకబాదడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడిని అదే రాష్ట్రానికి ప్రశాంత్ కుమార్‌గా రైల్వే పోలీసులు గుర్తించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బిహార్‌కు చెందిన ఓ కుటుంబం దిల్లీ వెళ్లేందుకు హమ్‌సఫర్ రైలు ఎక్కింది. జనరల్ టికెట్లు తీసుకున్న వారు, టీటీఈ వద్ద పర్మిషన్ తీసుకుని ఏసీ కోచ్-డీలో కూర్చున్నారు. అయితే ప్రయాణ మార్గంలో ఆ కుటుంబం వద్దకు రైల్వే ఉద్యోగి, ఆ కోచ్ అటెండెంట్ ప్రశాంత్ కుమార్ బుధవారం రాత్రి వచ్చారు. అదే సమయంలో బాధితురాలి తల్లి వాష్ రూమ్‌కు వెళ్లింది.
ఇదే అదనుగా తీసుకున్న ప్రశాంత్ కుమార్, బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత కాసేపటికే తల్లి రాగా బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పింది. అదే రైలులో ఉన్న తన భర్తకు బాధితురాలి తల్లి జరిగినదంతా చెప్పినప్పుడు తోటి ప్రయాణికులు విన్నారు. తీవ్ర ఆగ్రహంతో నిందితుడిని దారుణంగా కొట్టారు. గురువారం వేకువజామున కాన్పుర్ సెంట్రల్ స్టేషన్‌కు రైలు చేరుకోగానే జీఆర్పీ సిబ్బందికి సమాచారం అందించారు.
వెంటనే కాన్పుర్ జీఆర్పీ సిబ్బంది ప్రశాంత్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే తీవ్రమైన గాయాలతో ఉన్న అతడిని స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రైల్వే ఉద్యోగి చనిపోయాడు. అయితే బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు పోక్సో, వేధింపుల కేసులను నమోదు చేశారు.
మరోవైపు, మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లిన సైనికాధికారులపై కొంతమంది దుండగులు దాడిచేశారు. అనంతరం వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తొలుత వారి వద్ద ఉన్న నగదు, నగలను లాక్కున్న దుండగులు, ఆ తర్వాత మహిళల్లో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న ఓ సైనికాధికారి పోలీసులకు సమాచారమిచ్చారు. బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.