Bengal Governor Bose Accused Of Molestation : బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తనను వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. కోల్‌కతా రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై గవర్నర్ బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ సందర్భాల్లో వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. ఇక దీనిపై స్పందించేందుకు పోలీసులు ఆసక్తి చూపలేదు.
'సత్యం గెలుస్తుంది'
ఈ ఆరోపణలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ స్పందించారు. సత్యం గెలుస్తందని అన్నారు. కల్పిత కథనాలను చూసి తాను ఎప్పుడూ భయపడనని చెప్పారు. 'ఇలా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఎవరైనా కోరుకుంటే, గాడ్ బ్లెస్ దెమ్. కానీ, బంగాల్లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఆపలేరు' అని బోస్ చెప్పారు.
అవమానకరమైన ఘటన!
మరోవైపు, గవర్నర్‌పై వస్తున్న ఆరోపణలపై టీఎంసీ నాయకురాలు శశి పంజా స్పందించారు. "మేం పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యాం. సందేశ్‌ఖాలీకి వెళ్లి మహిళల హక్కుల గురించి మాట్లాడిన ఆయన, ఇప్పుడు చాలా అవమానకరమైన ఘటనకు పాల్పడ్డారు. ప్రతిష్ఠం భంగం కలిగించాడు. రాజ్‌భవన్ సిబ్బంది ఒకరిపై గవర్నర్ ఇలాంటి దారుణానికి పాల్పడటం కంటే అవమానకరం మరొకటి ఉండదు. ఈ విషయంపై గవర్నర్ స్పష్టంగా మాట్లాడాలి" అని డిమాండ్ చేశారు.
అయితే శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు బంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పలు బహిరంగ సభల్లో కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. సీవీ ఆనంద బోస్ 1977 బ్యాచ్ (రిటైర్డ్) ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్ 23వ తేదీన నుంచి బంగాల్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. అంతకుముందుకు ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధనఖడ్ బంగాల్ గవర్నర్‌గా ఉండేవారు. జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం వల్ల కొన్ని నెలలపాటు అప్పటి మణిపుర్ గవర్నర్ గణేశన్ బంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం సీపీ బోస్ బంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.