Banking Laws Amendment Bill : బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు - 2024ను కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టంలో బ్యాంకు ఖాతాలతో ముడిపడిన ఓ కీలక ప్రతిపాదన ఉంది. అదేమిటంటే ప్రస్తుతం ఒక బ్యాంకు అకౌంటుకు గరిష్ఠంగా ఒక నామినీని మాత్రమే అపాయింట్ చేసే అవకాశం ఖాతాదారుడికి ఉంది. ఇకపై ప్రతీ బ్యాంకు ఖాతాపై గరిష్ఠంగా నలుగురు నామినీలను అపాయింట్ చేసే వెసులుబాటును ఖాతాదారుడికి కల్పించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.
కంపెనీ లేదా ఏదైనా సంస్థలో డైరెక్టర్ హోదాలో ఉండేవారికి సబ్‌స్టాన్షియల్ ఇంట్రెస్ట్ (కనీస యాజమాన్య వాటా పరిమితి) గత 60 ఏళ్లుగా రూ.5 లక్షలు మాత్రమే ఉంది. దీన్ని రూ.2 కోట్లకు పెంచాలని బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు - 2024లో ప్రపోజ్ చేశారు. సహకార బ్యాంకులకు సంబంధించి కూడా కీలక మార్పులను ఈ బిల్లులో ప్రతిపాదించారు. చట్టబద్ధ ఆడిటర్లకు చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛను బ్యాంకులకే ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతినెలా రెండో, నాలుగో శుక్రవారాల్లో బ్యాంకులు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ చేస్తున్నాయి. ఆ తేదీలను ప్రతినెలా 15, చివరి తేదీలకు మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.
రాష్ట్రాల అధికారాన్ని లాక్కునే ప్రయత్నం : మనీశ్ తివారీ
సహకార సంఘాలకు సంబంధించిన అంశాలపై చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, దాన్ని కేంద్రం లాక్కునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ పేర్కొన్నారు. దీనికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. "బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌కు, కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధం ఉంది. అందుకే సహకార సంఘాలకు సంబంధించిన ప్రతిపాదనను మేం చేయాల్సి వచ్చింది" అని తెలిపారు. "కోఆపరేటివ్ బ్యాంకులను మేం చిన్నచూపు చూడటం లేదు. ఆ బ్యాంకులు అందిస్తున్న సేవలను ఎవరూ కాదనలేరు. బ్యాంకులైనా,కోఆపరేటివ్ బ్యాంకులైనా ఒక బ్యాంకింగ్ లైసెన్సుతో పనిచేస్తాయి. అందుకే వాటిని కూడా ఈ సంస్కరణల పరిధిలో చేర్చాల్సి వచ్చింది" అని నిర్మల వివరించారు. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు - 2024కు కేంద్ర క్యాబినెట్ గత శుక్రవారమే ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలోనే ఈ బిల్లుకు సంబంధించిన విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మల ప్రకటించారు. బ్యాంకుల నిర్వహణను మెరుగుపర్చేందుకు, ఇన్వెస్టర్ల భద్రతకు భరోసా కల్పించేందుకు బ్యాంకింగ్ చట్టాల సవరణ అవసరమని ఆమె బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.