Babies Born On Ayodhya Pran Pratishtha : అయోధ్యలోని భవ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగిన వేళ పలువురు గర్భిణులకు చిరస్మరణీయ క్షణంగా నిలిచిపోయింది. తమ నవజాత శిశువులు శుభముహుర్తంలో జన్మించాలని వైద్యులను ముందుగా సంప్రదించి మరీ సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకున్నారు కొందరు మహిళలు. మరికొందరు గర్భిణులు సహజంగానే ప్రసవించారు.
పట్నాలో 500మంది శిశువులు జననం
ఒక్క బిహార్ రాజధాని పట్నాలోనే సుమారు 500కు పైగా మంది శిశువులు జన్మించారని అధికారులు చెబుతున్నారు. కంకర్‌బాగ్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో సోమవారం 34మంది జన్మించగా, అందులో 19 మంది మగ, 15మంది ఆడ శిశువులు ఉన్నారు. ఎంతో పవిత్రమైన రోజు తమ ఇంట్లోకి పిల్లలు రావడం పట్ల కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముస్లిం బాలుడికి రామ్ రహీమ్‌గా నామకరణం
ప్రాణప్రతిష్ఠ రోజు జన్మించిన నవజాత శిశువులకు రామ్, సీత అని పేర్లను పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు వారివారి తల్లిదండ్రులు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిలో ముస్లిం కుటుంబంలో జన్మించిన మగబిడ్డకు అతడి అమ్మమ్మ రామ్ రహీమ్ అని పేరు పెట్టారు. "ఫర్జానా అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. హిందూ-ముస్లింల ఐక్యత సందేశం ఇవ్వాలని కోరుతూ ఆ చిన్నారి అమ్మమ్మ హుస్నా రామ్ రహీమ్ అని పేరు పెట్టింది" అని జిల్లా మహిళా ఆస్పత్రి ఇంఛార్జ్ డాక్టర్ నవీన్ జైన్ తెలిపారు.
కర్ణాటకలో 20మంది ప్రసవం
కర్ణాటక విజయపురలోని శ్రీ సిద్దేశ్వర్ లోక కల్యాణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో జనవరి 22న ప్రసవం చేయాలని 50 మందికి పైగా గర్భిణుల నుంచి ప్రత్యేక అభ్యర్థనలు వచ్చాయి. కానీ గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు 20మందికి మాత్రమే ప్రసవం చేశారు. తనకు పుట్టిన బిడ్డకు సీత అని పేరు పెట్టినట్లు ఓ మహిళ తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ జరగుతుండగా మరో మహిళ సహజంగా ప్రసవించింది.
ప్రాణప్రతిష్ఠ ముహుర్తాన మహిళ ప్రసవం
మహారాష్ట్రలోని ఠానే నగరంలో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆ మహిళ ప్రసవించినట్లు వైద్యులు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ కాన్పుర్‌లోని గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్ బోధనాస్పత్రిలో జనవరి 22వ తేదీన 25 మంది శిశువులకు జన్మించారని వైద్యులు తెలిపారు.
ఇందౌర్‌లో 47మంది జననం
మధ్యప్రదేశ్‌లోని మూడు జిల్లాలో 47మంది శిశువులు జన్మించారని అధికారులు వెల్లడించారు. పుట్టిన శిశువులంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. దేపాల్‌పుర్ సివిల్ ఆస్పత్రిలో లోకేశ్, సంజన దంపతులకు ఆడ శిశువు జన్మించినట్లు అక్కడి వైద్యురాలు తెలిపారు. సంజనకు జనవరి 22న కాన్పు చేయాలని తాను ముందుగానే వైద్యులను కోరగా ప్రసవానికి తగిన సమయం పూర్తికాకపోవడం వల్ల వైద్యులు నిరాకరించారని లోకేశ్ అనే వ్యక్తి తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 11 గంటల సమయంలో తన భార్యకు నొప్పులు రావడం వల్ల సిజేరియన్ చేశారని, తమకు పాప పుట్టిందని తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు అతడు తెలిపాడు.
రాముడు వచ్చేశాడు! తర్వాతేంటి? అందరికీ దర్శనం ఎప్పుడు? ఏ సమయంలో వెళ్లొచ్చు?
రామమందిర కార్మికులను గౌరవించిన మోదీ- పూల వర్షం కురిపించి కృతజ్ఞతలు