Arvind Kejriwal Judicial Custody : మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది కోర్టు. ఈ కేసులో 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆయనను తిహాడ్ జైలుకు తరలించనున్నారు.
అప్పటి వరకు జ్యుడీషిల్ కస్టడీ
దిల్లీ మద్యం కేసులో మార్చి 21న అరెస్టైన కేజ్రీవాల్‌కు తొలుత ఏడు రోజులు, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. తాజాగా ఆ గడువు ముగియడం వల్ల సోమవారం అధికారులు కేజ్రీవాల్‌ను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. విచారణకు సీఎం కేజ్రీవాల్ సహకరించడం లేదని, దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. కొన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్‌ను మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని, అప్పటివరకు జ్యుడీషియల్ కస్టడీ విధించాలని కోరారు. ఇందుకు అంగీకరించిన కోర్టు, 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
'ఏం అడిగినా చెప్పడం లేదు'
అయితే విచారణ సందర్భంగా మద్యం కేసు నిందితుడు విజయ్ నాయర్ గురించి కేజ్రీవాల్‌ను ప్రశ్నించామని ఈడీ తెలిపింది. అందుకు జవాబుగా, విజయ్ తనకు రిపోర్ట్ చేయలేదని, మంత్రి అతిషికి రిపోర్ట్ చేశారని కేజ్రీవాల్ చెప్పారని ఈడీ పేర్కొంది. తన క్యాంపు కార్యాలయంలో ఎవరున్నారు అనేది కూడా తెలియని విధంగా కేజ్రీవాల్ సమాధానాలు చెప్పారని కోర్టుకు వివరించింది. ఈ కేసుతో ముడిపడి ఉన్న వివిధ వాట్సాప్ చాట్‌లను చూపించి వాటిపై ప్రశ్నలు అడిగినా కేజ్రీవాల్ ఏమీ చెప్పలేదని ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఆయన డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్‌లను తమకు అందించడం లేదని న్యాయస్థానానికి తెలియజేసింది.
మూడు పుస్తకాలతో జైలుకు
అరవింద్ కేజ్రీవాల్‌ను సోమవారం సాయంత్రం తిహాడ్ జైలు అధికారులకు ఈడీ అప్పగించనుంది. తనతో పాటు జైలుకు 'భగవద్గీత', 'రామాయణం', నీర్జా చౌదరి రచించిన 'హౌ పీఎం డిసైడ్స్' పుస్తకాలను తీసుకెళ్లడానికి కోర్టును కేజ్రీవాల్ అనుమతి కోరారు. అందుకు న్యాయస్థానం అంగీకరించింది.
'ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ పరిపాలన ఆపాలి'
మరోవైపు ఈడీ కస్టడీలో నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వ సంబంధిత ఆదేశాలను జారీ చేయడాన్ని ఆపాలంటూ వేసిన పిటిషన్‌ను కూడా దిల్లీ హైకోర్టు పరిశీలించింది. ఈ విషయంపై సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం కేజ్రీవాల్ కేసును విచారిస్తున్న దిగువ కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని ఈడీకి సూచించింది. కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీలో కంప్యూటర్, ప్రింటర్, ఇతర పరికరాలకు అందిస్తున్నారు అంటూ పిటిషనర్ చేసిన ఆరోపణను ఈడీ తరఫు న్యాయవాది ఖండించారు. అలాంటి వసతులేవీ తాము కేజ్రీవాల్‌కు కల్పించడం లేదని కోర్టుకు తెలిపారు.
'సీఎం పదవిలో ఉండేందుకు అర్హుడు కాదు'
ఈ పిటిషన్‌ను అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది రాహుల్ మెహ్రా తప్పుపట్టారు. హైకోర్టులో ఇలాంటి పిటిషన్లు వేసే వారు కనీస ఆధారాలను చూపించే స్థితిలో ఉండాలని పేర్కొన్నారు. ఒక కేసులో దర్యాప్తు జరుగుతుండగా ఎలాంటి ఆధారాలు లేని థర్డ్ పార్టీ (పిల్ వేసిన పిటిషనర్) జోక్యానికి అనుమతించడం సరికాదని హైకోర్టుకు ఆయన నివేదించారు. అయితే సుర్జిత్ సింగ్ యాదవ్ దాఖలు చేసిన దాన్ని ఒక పిటిషన్‌గా కాకుండా ఓ రిప్రజెంటేషన్‌లా పరిగణించాలని ఈడీని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. జైలులో ఉన్న వ్యక్తి సీఎం పోస్టులో కొనసాగేందుకు అర్హుడు కాదంటూ ఇంతకుముందు హైకోర్టులో పిటిషన్ వేసింది కూడా సుర్జిత్ సింగ్ యాదవే. ఆ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టేసింది.
'రూ.3500 కోట్ల పన్ను నోటీసులు- కాంగ్రెస్‌పై అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోం' - congress income tax