Arunachal Pradesh India China : విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా, అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేసిన అసంబద్ధమైన వాదనలు పూర్తిగా నిరాధారామైనవని భారత్ స్పష్టం చేసింది. భారత్‌లో ఆరుణాచల్ ప్రదేశ్ విడదీయరాని భాగమని తేల్చి చెప్పింది. భారత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ఫలాలను అరుణాచల్ ప్రజలు లబ్ది పొందుతూనే ఉంటారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది. భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చేసిన అసంబద్ధమైన వాదనలను తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన ఇలాంటి వాదనలను మళ్లీ మళ్లీ వల్లె చేసినా అవి చెల్లుబాటు కావని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఇటీవల జిజాంగ్ తమ భూభాగమేనని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చైనా పెట్టుకున్న పేరు జిజాంగ్. ఇటీవల భారత ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించడంపై చైనా అభ్యంతరం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తాము ఎప్పటికీ గుర్తించబోమని డ్రాగన్ మరోసారి విషం కక్కింది.
ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం రక్షించుకునే క్రమంలో తాము నిత్యం అప్రమత్తంగా ఉంటామని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఝాంగ్ షియాంగాంగ్ వ్యాఖ్యానించారు. భారత్ చేపడుతున్న చర్యలు సరిహద్దు వెంబడి శాంతిస్థాపనకు అనుకూలం కాదని అన్నారు. దీనిపైనా భారత విదేశాంగ శాఖ స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటనపై చైనా చేసిన వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నామని తెలిపింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో సరిహద్దు వెంబడి మిలిటరీ సన్నద్ధతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం సెలా టన్నెల్ నిర్మించింది. సరిహద్దు వెంబడి సైన్యాల తరలింపునకు ఈ టన్నెల్ ఎంతో ఉపకరిస్తుంది. అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే సెలా సొరంగ మార్గం దేశభద్రత రీత్యా అత్యంత కీలకంగా మారింది. 13 వేల అడుగుల ఎత్తున ఈ సొరంగ మార్గం ప్రపంచంలోనే అతిపెద్ద బైలేన్ టన్నెల్‌గా పేరుగాంచింది. పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది.
'మూడు వారాల్లోగా సమాధానం చెప్పండి'- CAAపై కేంద్రానికి సుప్రీం డెడ్‌లైన్!
'దేశప్రజలు మార్పును కోరుకుంటున్నారు'- CWC మీటింగ్‌లో బీజేపీపై ఖర్గే విమర్శలు