April Warmest Month Of the year 2024 : ఏప్రిల్ నెలలో ఎండలు దంచికొట్టాయి. దీంతో '2024 ఏప్రిల్' చరిత్రలో అత్యంత వేడి నెలగా కొత్త రికార్డును లిఖించింది. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ 'కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్' (సీ3ఎస్) వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది. వరుసగా గత 11 నెలలుగా అధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయని, అదే ట్రెండ్ ఏప్రిల్‌లోనూ కొనసాగిందని సీ3ఎస్ వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం క్షీణిస్తుండటం, మనుషుల నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల వచ్చిన వాతావరణ మార్పులతో ఏప్రిల్‌లో ఎండలు అంతగా మండిపోయాయని చెప్పింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, భారీ వర్షపాతం, వరదల వల్ల అనేక దేశాలలో ప్రజల రోజువారీ జీవితానికి అంతరాయం కలిగిందని నివేదికలో వివరించింది సీ3ఎస్.
19వ శతాబ్దంతో పోలిస్తే
ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.03 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని సీ3ఎస్ నివేదిక తెలిపింది. ఇది పారిశ్రామికీకరణకు మునుపటి కాలమైన 1850-1900లో ఏప్రిల్ నెలల్లో నమోదైన సగటు ఉష్ణోగ్రతల కంటే 1.58 డిగ్రీల సెల్సియస్ ఎక్కువని పేర్కొంది. 1991-2020 మధ్యకాలంలో ఏప్రిల్‌లో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.67 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత అధికంగా నమోదైందని సీ3ఎస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన ఉష్టోగ్రత 2016 ఏప్రిల్ నాటి గరిష్ఠ ఉష్ణోగ్రత కంటే 0.14 డిగ్రీల సెల్సియస్ ఎక్కువని తెలిపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా గత 174 సంవత్సరాల రికార్డులో అత్యంత వేడి సంవత్సరంగా 2023 నిలిచింది.
పరీక్షా కాలంగా నిలిచిన ఏప్రిల్
ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, భారత్‌లో ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలయ్యాయి. యూఏఈలో గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షపాతం నమోదైంది కూడా ఏప్రిల్ నెలలోనే. సముద్ర జలాలు అత్యంత వేడెక్కిన నెలగానూ ఈ ఏడాది ఏప్రిల్ నిలిచింది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో గత 13 నెలలుగా ప్రపంచంలోని సముద్రాల జలాలు వేడెక్కుతున్నాయని సీ3ఎస్ నివేదిక తెలిపింది.
భారతదేశ వాతావరణ విభాగం (ఐఎండీ) సహా ఇతర ప్రపంచ దేశాల వాతావరణ సంస్థలు ఈ ఏడాదిలో ఆగస్టు-సెప్టెంబర్ నాటికి లా నినో పరిస్థితులు ఏర్పడొచ్చని అంచనా వేస్తున్నాయి. ఎల్ నినో ఏర్పడినప్పుడు రుతుపవనాలు బలహీనపడతాయి. దాని ప్రభావంతో మన దేశంలో పొడి వాతావరణం ఏర్పడుతుంది. ఎల్ నినో పరిస్థితులు సగటున ప్రతి రెండు నుంచి ఏడేళ్లకోసారి సంభవిస్తుంటాయి. ఒకసారి మొదలైతే దీని ప్రభావం దాదాపు 9 నుంచి 12 నెలల పాటు ఉంటుంది. ప్రస్తుతమున్న ఎల్ నినో 2023 జూన్‌లో తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. దాని తీవ్ర ప్రభావాన్ని చాలా దేశాలు 2023 నవంబరు నుంచి 2024 జనవరి మధ్యకాలంలో చవిచూశాయి. అందుకే ఎల్ నినో పరిస్థితులు వచ్చే నెలాఖరుకల్లా ముగిసిపోయి.. లానినో మొదలవుతుందని అంటున్నారు.
40ఏళ్ల తర్వాత రేప్ కేస్ నిందితుడు అరెస్ట్- ఆ టెక్నాలజీతోనే! - Man Arrested After 40 Years