Anna Hazare On Kejriwal Arrest : అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. తాను చేసిన పనుల వల్లే కేజ్రీవాల్ అరెస్టు అయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన ఏం చేయగలరని ప్రశ్నించారు. ఇప్పుడు ఏం జరగాలో అది చట్ట ప్రకారం జరుగుతుందని అన్నా హజారే చెప్పారు. తనతో కలిసి పనిచేసి, మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడు లిక్కర్ పాలసీలు చేస్తున్నందుకు చాలా బాధపడ్డానని తెలిపారు.
సుప్రీంలో పిటిషన్ ఉపసంహరణ
మరోవైపు, ఈడీ అరెస్టుకు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ వెనక్కి తీసుకున్నారు. దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ పిటిషన్‌పై విచారణ దృష్ట్యా వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫున న్యాయవాది మను సింఘ్వి, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనానికి తెలిపారు.
అంతకుముందు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఈ కేసును సత్వరమే విచారించాల్సిందిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం వద్ద ఈ విషయం ప్రస్తావించాల్సిందిగా సీజేఐ సూచించారు. అనంతరం ఈ కేసును విచారించేందుకు జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల ప్రత్యేక ధర్మాసనం అంగీకరించింది.
కేజ్రీ భద్రతపై ఆప్ ఆందోళన
అరవింద్ కేజ్రీవాల్ భద్రతపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని, ఇప్పుడు ఈడీ కస్టడీలో కేంద్రం తగిన రక్షణ కల్పిస్తుందా? అని మంత్రి ఆతిశీ ప్రశ్నించారు. "ఎన్నికలకు ముందు విపక్ష నేతలపై దాడులు మొదలయ్యాయి. కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు, ఆప్‌ను అణచివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆ యత్నాలకు దిల్లీ వాసులే కాకుండా దేశ ప్రజలు సరైన సమాధానం చెప్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం'' అని ఆతిశీ అన్నారు.
ఆప్ మంత్రులు అరెస్టు
కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ దిల్లీ ఆప్ నేతలు రోడ్డెక్కారు. బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నిరసనలు చేపట్టిన ఆప్ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఆప్ ఎమ్మెల్యే రాఖీ బిర్లాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఐటీఓ ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేశారు.
పంజాబ్, తమిళనాడులో నిరసనలు
కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ పంజాబ్ తమిళనాడులో నిరసలు చేశారు. చెన్నైలోని ఈడీ కార్యాలయం ముందు డీఎంకే నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేజ్రీ అరెస్టును ఖండిస్తున్నట్లు డీఎంకే నేత దయానిధి మారన్ అన్నారు. పంజాబ్‌లోని మొహాలీలో ఆప్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఒడిశాలోని భూవనేశ్వర్‌లో ఆప్ కార్యకర్తలు కేజ్రీ అరెస్టును నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు.