Animal In Rashtrapati Bhavan Viral Video : రాష్ట్రపతి భవన్‌లో అంగరంగ వైభవంగా ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వివిధ దేశాధినేతలు, ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు, సినీ తారలతో సహా 8 వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానం లేని ఓ అతిథి వచ్చి కెమెరాకు చిక్కడం వైరల్‌గా మారింది.
చిరుత పులా? లేక సాధారణ పిల్లా?
బీజేపీ ఎంపీ దుర్గా దాస్ ఉకే ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నమస్కరిస్తున్నప్పుడు వెనుక ఓ జంతువు వెళ్తుండడం ఆ వీడియోలో కనిపించింది. అలా వెళ్లింది చిరుత పులా? లేక సాధారణ పిల్లా? లేక శునకమా ? అన్నది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. రాష్ట్రపతి భవన్‌లో ఓ జంతువు అడవిలో ఉన్నట్లు తాపీగా సంచరించినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది.
నిజమా? నకిలీనా?
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం ఉండే రాష్ట్రపతి భవన్‌లో విదేశీ దేశాధినేతలు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, నటులు పాల్గొన్న ఈ వేడుకలో అనుకోని అతిథిగా ఓ జంతువు రావడం కలకలం రేపుతోంది. ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడం చర్చనీయాశంగా మారింది. ఈ వీడియో నిజమైందా లేక ఎవరైనా మార్ఫ్ చేశారా అని తొలుత సందేహాలు వ్యక్తమయ్యాయి. ఫేక్ వీడియో లేదా ఏఐ జనరేటెడ్ వీడియో అయ్యి ఉంటుందని కొట్టిపారేశారు.
ఒక్కొక్కరు ఒక్కోలా
కానీ ప్రధానమంత్రి కార్యాలయం షేర్ చేసిన యూట్యూబ్ లైవ్ ఫీడ్‌ను పరిశీలించినప్పుడు ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది. నడుస్తున్న ఠీవీని బట్టి అది పులి అని కొందరు, పిల్లి అయ్యుంటుందని ఇంకొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకేదైనా పెంపుడు జంతువు కావొచ్చని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ప్రమాణస్వీకారం ప్రశాంతంగా ముగిసిందని ట్వీట్లు చేస్తున్నారు. జంతువు సంచరించిన విషయంపై రాష్ట్రపతి భవన్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.