Amit Shah On POK : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్ లో అంతర్భాగమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. తమను భయపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పొరుగు దేశం(పాకిస్థాన్) వద్ద అణు బాంబులు ఉన్నాయని వ్యాఖ్యానిస్తోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తొలి ఐదు విడతల్లో ప్రధాని నరేంద్ర మోదీ 310 సీట్లు గెలుచుకున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. చివరి రెండు దశల్లో ఎన్డీఏ 400 సీట్ల లక్ష్యాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 40 సీట్లకే పరిమితమవుతుందని ఎద్దేవా చేశారు.
"కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు అవుతారో తెలియదు. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆరు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కమలం పార్టీని గెలిపించాలి. ఎన్డీఏ 400 సీట్లు సాధించడానికి రాష్ట్ర ప్రజలు సహకరించాలి. అభివృద్ధి అనేది బీజేపీకి అలవాటే. పీఓకే గురించి మేం మాట్లాడితే కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ వద్ద అణు బాంబులు ఉన్నాయని భయపెడుతున్నారు. రాహుల్ బాబా మేం మోదీ సేవకులం. అణుబాంబులకు భయపడం. పీఓకే భారత్‌కు చెందిన భూభూగం. దాన్ని స్వాధీనం చేసుకుంటాం" అని అమిత్ షా హిమాచల్ ప్రదేశ్‌లో ఉనాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు.
పాక్ మాజీ మంత్రికి కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
భారతదేశ సార్వత్రిక ఎన్నికలు, దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చిన పాకిస్థాన్ ఎంపీకి దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. భారతదేశ వ్యవహారాల్లో తల దూర్చకుండా 'మీ దేశం సంగతి మీరు చూసుకోండి' అంటూ ఘాటుగా బదులిచ్చారు.
'మా దేశ సమస్యలను మేం పరిష్కరించుకోగలం'
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్, తన కుటుంబసభ్యులతో కలిసి దిల్లీలో ఓటు వేశారు. అనంతరం ఓటు వేసినట్లు సిరా వేళ్లను చూపుతూ ఉన్న ఫొటోను తన అధికారిక ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు పాకిస్థాన్ మాజీ మంత్రి చౌధరి ఫహద్ హుస్సేన్ రీపోస్ట్ చేశారు. ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్ పెట్టారు. దానికి ఇండియా ఎలక్షన్స్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
'చౌధరి సాహిబ్ మా దేశ సమస్యలను నేను, నా దేశ ప్రజలు పరిష్కరించుకోగలం. ఈ విషయంలో మీ సలహాలేం మాకు అక్కర్లేదు. అసలే మీ దేశం పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ముందు దాని సంగతి చూడండి. భారత్‌లో ఎన్నికలు అనేవి మా అంతర్గత వ్యవహారం. ప్రపంచంపైకి ఉగ్రవాదాన్ని ఎగదోసే మీలాంటి వారి జోక్యాన్ని మా దేశం ఏమాత్రం సహించదు' అని కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. మళ్లీ కేజ్రీవాల్ పోస్ట్‌లపై స్పందించారు ఫవాద్ హుస్సేన్. 'సీఎం సాబ్ సార్వత్రిక ఎన్నికలు మీ అంతర్గత వ్యవహారం. కానీ మీరు తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నాను. పాకిస్థాన్‌లో పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. అయితే ఎవరు ఎక్కడున్నా మెరుగైన సమాజం కోసం ప్రయత్నించాలి' అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
'కేజ్రీవాల్‌కు అండగా పాకిస్థాన్!'
ఆప్ అధినేత అవినీతి రాజకీయాలకు పాకిస్థాన్ కూడా మద్దతుగా నిలిచిందని కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. దేశ శత్రువులతో కేజ్రీవాల్ చేతులు కలిపినట్లు బీజేపీ ముందు నుంచే చెబుతోందని దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా ఆరోపించారు. కేజ్రీవాల్‌కు పాకిస్థాన్ మద్దతుగా ఉందని ఫవాద్ హుస్సేన్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించారు.