Amit Shah Helicoptor Loses Control : కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాకు త్రుటిలో హెలికాప్టర్ ప్రమాదం తప్పిందని వచ్చిన వార్తలను హోం శాఖ ఖండించింది. అలాంటిదేమీ జరగలేదని పేర్కొంది. " కేంద్ర హోం మంత్రి హెలికాప్టర్ బీహార్‌లోని బెగుసరయ్ నుంచి బయలుదేరుతున్నప్పుడు కొంత బ్యాలెన్స్ సమస్య ఉందని కొన్ని వార్తా సంస్థలు నివేదించాయి. అలాంటి సమస్యలు ఏమీ లేవని దయచేసి గమనించండి." అని హోం శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే అంతకుముందు, హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొంతసేపు నియంత్రణ కోల్పోయిందని వార్తలు వచ్చాయి. 'బిహార్‌లోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా ప్రచారం ముగించుకుని హెలికాప్టర్‌లో బయల్దేరారు. టేకాఫ్ క్రమంలో హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి కుడివైపు దిశగా కొంతసేపు ఊగిసలాడింది. ఒక దశలో నేలను తాకబోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్‌ను కంట్రోల్ చేశాడు. దీంతో అది నిర్ణీత మార్గంలో బయల్దేరింది.' అనే నివేదికలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ నివేదికలు నిజం కాదని హోం శాఖ తెలిపింది.
గత వారం అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రతికూల వాతావరణం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ కారణంగా కిందకు దిగలేకపోయింది. ఏప్రిల్ 21న బంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు కేంద్ర మంత్రి వెళ్లారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల హెలికాప్టర్ ల్యాండింగ్ విఫలమైంది. దీంతో ఆ పర్యటనను అమిత్ షా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.