Ajit Pawar NCP EC : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో వర్గపోరును కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఈసీ తేల్చింది. ఆరు నెలల పాటు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది. శాసనసభలో మెజారిటీ నిరూపించుకున్న నేపథ్యంలో ఎన్సీపీ గుర్తు అయిన 'గడియారం' అజిత్ వర్గానికే చెందుతుందని ఈసీ స్పష్టం చేసింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం తమ పార్టీకి కొత్త పేరు పెట్టుకునే వీలు కల్పిస్తున్నట్లు ఈసీ పేర్కొంది.
పార్టీ లక్ష్యాలు, రాజ్యాంగం, రెండు వర్గాల సంస్థాగత, శాసనసభ్యుల మెజారిటీని పరిగణలోకి తీసుకున్న అనంతరం ఎన్నికల సంఘం ఈ నిర్ణయానికి వచ్చింది. శాసనసభలో అజిత్ వర్గానికి మెజారిటీ ఉండటం, దీంతోపాటు ఇరువర్గాలు సంస్థాగత ఎన్నికలు లేకుండా పార్టీ రాజ్యాంగం పరిధి బయట కార్యకలాపాలు నిర్వహించడాన్ని కూడా ఈసీ పరిగణలోకి తీసుకుంది.
ఈసీ నిర్ణయంతో పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన పార్టీకి కొత్త పేరు పెట్టుకోవడానికి బుధవారం మధ్యాహ్నం వరకు శరద్ పవార్ వర్గానికి ఈసీ సమయం ఇచ్చింది. అందులో భాగంగా మూడు పేర్లను తమకు సూచించాలని పేర్కొంది.
ఈసీ తీర్పును అంగీకరిస్తున్నా : అజిత్ పవార్
ఎన్నికల సంఘం ఇచ్చిన తీర్పుపై అజిత్ పవార్ స్పందించారు. ఈసీ తీర్పును అంగీకరిస్తున్నట్లు తెలిపారు. మెజారిటీ ఆధారంగానే ఈసీ ఈ నిర్ణయం వెలువరించిందని పేర్కొన్నారు. మరోవైపు అజిత్ పవార్‌కు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ శుభాకాంక్షలు తెలిపారు.
శరద్ పవార్‌తోనే కార్యకర్తలు : సుప్రియా సూలే
పార్టీ కార్యకర్తలు శరద్ పవార్‌తోనే ఉన్నారని ఆయన కుమార్తె సుప్రియా సూలే అన్నారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, ఎన్సీపీ వ్యవస్థాపకుడు, వ్యవస్థాపక నాయకుడు శరద్ పవార్ అని తెలిపారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు వేరుగా ఉన్నట్లు చెప్పారు. శరద్ పవార్ మళ్లీ పార్టీ పునర్నిర్మిస్తారని తెలిపారు. అయితే ఈసీ నిర్ణయం వెనుక అదృశ్య శక్తి ఏదో ఉందని అన్నారు.
'ఈసీ తీర్పు సుప్రీంకు వెళతాం'
ఈసీ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతామని శరద్ వర్గం నేత జయంత్ పాటిల్ తెలిపారు. అది తమకు చివరి ఆశ అని అన్నారు. ఈసీ నిర్ణయంపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధిస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. తాము శరద్ పవార్ వెంటే ఉండాల్సిన అవసరం ఉందని, పార్టీ కార్యకర్తలు ఆందోళనపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎన్సీపీని స్థాపించింది శరద్ పవారేనన్న జయంత్, పార్టీని కింది స్థాయి నుంచి అభివృద్ధి చేశారని తెలిపారు. పార్టీలో చాలా మంది నాయకులు ఎదగడానికి సహాయపడ్డారని చెప్పారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు తమ విధేయతను మార్చుకున్నప్పటికీ, పార్టీ వారిని అనుసరించదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని జయంత్ తెలిపారు. అయినప్పటికీ, మెజారిటీ ఆధారంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
గతేడాది నాటకీయ పరిణామాలకు ఎన్సీపీ వేదికైంది. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శరద్ పవార్ మే నెలలో ప్రకటించారు. కొత్త తరానికి పార్టీని అప్పగిస్తున్నట్లు చెప్పారు. అధ్యక్షుడిని ఎన్సీపీ సభ్యులు ఎన్నుకోవాలని సూచించారు. అయితే పార్టీ నేతలు, కార్యకర్తల నిరసనల నేపథ్యంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ పరిణామాలు జరిగిన రెండు నెలలకే అజిత్ పవార్ పార్టీని చీల్చారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి జులైలో బీజేపీ-శివసేన కూటమితో కలిసి ప్రభుత్వంలో చేరారు. పార్టీ పేరు, గుర్తును తమ వర్గానికే కేటాయించాలని ఈసీని కోరారు.
'పీఎం కిసాన్ నిధుల పెంపు'- పార్లమెంట్లో మోదీ సర్కార్ క్లారిటీ
'ఆడియో రికార్డింగ్స్ డిలీట్ చేశారు'- ఈడీపై ఆప్ సంచలన ఆరోపణలు- దర్యాప్తు సంస్థ ఫైర్