AI CCTV Surveillance UPSC : నీట్, నెట్ పరీక్షల్లో అవకతవకల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో దేశంలోని అత్యున్నత నియామక సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అప్రమత్తం అయింది. పరీక్షల్లో అవకతవకలకు తావులేకుండా చేయడానికి మరిన్ని పకడ్బందీ చర్యలను చేపట్టే దిశగా కసరత్తు మొదలుపెట్టింది. తమ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించే సెంటర్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సీసీటీవీ నిఘా వ్యవస్థను వినియోగించాలని నిర్ణయించింది.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి ఆధార్ ఆధారిత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ తీసుకోవడం, అభ్యర్థుల ముఖ గుర్తింపు, ఈ-అడ్మిట్ కార్డ్‌ల క్యూఆర్ కోడ్ స్కానింగ్, లైవ్ ఏఐ బేస్డ్ సీసీటీవీ సర్వైలెన్స్ సర్వీస్‌లను ఇకపై వినియోగించేందుకు యూపీఎస్సీ సిద్ధమైంది. పరీక్షా కేంద్రాల్లో ఈ విధమైన అధునాతన నిఘా సేవలను అందించడానికి అనుభవం కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ జూన్ 3వ తేదీనే టెండరును విడుదల చేసింది. ఆసక్తి కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు జులై 7న మధ్యాహ్నం 1 గంటలలోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే రోజున మధ్యాహ్నం 1.30 గంటలకు బిడ్లను తెరిచి, ఆయా సంస్థల అర్హత ప్రమాణాలను సరి చూస్తారు.
ఏఐ సీసీ కెమెరాలు ఇలా పనిచేస్తాయ్?
యూపీఎస్సీ విడుదల చేసిన టెండరు డాక్యుమెంట్ ప్రకారం, పరీక్షల నిర్వహణ ప్రక్రియను పటిష్టం చేయడమే ఈ ఏర్పాట్ల ప్రధాన లక్ష్యం. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు అక్రమాలకు పాల్పడే అవకాశం లేకుండా చేయడమే యూపీఎస్సీ ఏకైక సంకల్పం. జూన్ 3న యూపీఎస్సీ విడుదల చేసిన టెండరు డాక్యుమెంటులో పలు కీలక నిబంధనలు ఉన్నాయి. ఏఐ సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉండాలనే మార్గదర్శకాలను కూడా వాటిలో యూపీఎస్సీ పొందుపరిచింది. వాటిని చూస్తే యూపీఎస్సీ పరీక్షల నిఘా సేవలకు ఎంపికయ్యే సంస్థ ప్రతి పరీక్షా గదిలో ఏఐ సీసీటీవీ కెమెరాను అమర్చాలి.
ప్రతి పరీక్షా గదిలో సగటున 24 మంది అభ్యర్థులు ఉంటారు. ఎగ్జామ్ సెంటర్ ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్, కంట్రోల్ రూమ్‌లో తగిన సంఖ్యలో సీసీటీవీ కలర్ కెమెరాలను ఇన్‌స్టాల్ చేయాలి. పరీక్ష జరిగే గదిలో అనుమానిత కదలికలు జరుగుతున్నా ఇన్విజిలేటర్ స్పందించకుండా నిర్లిప్తంగా ఉండిపోతే ఏఐ సీసీ కెమెరాలు స్పందించి ఎగ్జామ్ కంట్రోల్ రూంకు అలర్ట్ మెసేజ్ పంపుతాయి. పరీక్ష జరగడానికి గంట ముందు లేదా గంట తర్వాత పరీక్ష గదిలో అనుమానిత కదలికలు జరిగినా సీసీ కెమెరాలు రికార్డు చేసి ఎగ్జామ్ కంట్రోల్ రూంకు తెలియచేస్తాయి. సీసీ కెమెరాలను వేటితోనైనా కప్పినా, వాటిపై నలుపు రంగు పూసినా వెంటనే ఎగ్జామ్ కంట్రోల్ రూంకు సమాచారాన్ని చేరవేస్తాయి.
యూపీఎస్సీ ఎంత కీలకమైందో తెలుసా?
యూపీఎస్సీ ప్రధానంగా 14 ప్రధాన పరీక్షలను నిర్వహిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌లను ఎంపిక చేయడానికి ఉద్దేశించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ను కూడా యూపీఎస్సీయే నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గ్రూప్ 'ఎ', గ్రూప్ 'బి' కేటగిరీ పోస్టులను కూడా ప్రతి సంవత్సరం యూపీఎస్సీయే నిర్వహిస్తుంటుంది. దేశంలోని దాదాపు 80 కేంద్రాల్లో యూపీఎస్సీ పరీక్షలు జరుగుతుంటాయి. ఏటా దాదాపు 26 లక్షల యూపీఎస్సీ ఉద్యోగభర్తీ పరీక్షలు రాస్తుంటారు. ఇంత భారీ సంఖ్యలో ఉండే అభ్యర్థులపై నిఘా కోసం, అవకతవకలకు తావు లేకుండా చూసేందుకుగానూ ఏఐ టెక్నాలజీ, డిజిటల్ సదుపాయాలను సమర్థంగా వాడుకోవాలని యూపీఎస్సీ యోచిస్తోంది.