Actor Mohanlal In Wayanad : వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్ స్వయంగా ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం రూ.3 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్ వయనాడ్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
UPDATE WITH CORRECTION: Actor Mohanlal, who is also a Lieutenant Colonel in the Indian Territorial Army, on Saturday reached the landslide-hit Wayanad donning his army uniform. The actor, who reached the Army camp at Meppadi, held a brief discussion with the officers and left for… pic.twitter.com/JbDQ2kXbIh
— Press Trust of India (@PTI_News) August 3, 2024
రూ.1 లక్ష విరాళం ప్రకటించిన సీఎం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వయనాడు బాధితుల కోసం రూ.1 లక్ష విరాళం ప్రకటించారు. ఆయన భార్య టి.కె. కమల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.33,000 అందించారు. మరోవైపు కేరళ సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు కూడా తమ నెల జీతం రూ.50,000లను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నామని తెలిపారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎంతోమంది మృతిచెందడం యావత్ దేశాన్ని కలచివేస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకువస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళాలు ఇచ్చారు. తాజాగా కమల్‌హాసన్ రూ.25లక్షలు విరాళం అందించారు. మరోవైపు ఆచూకీ గల్లంతైనవారిని గుర్తించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ముమ్మర ప్రయత్నం కొనసాగుతోంది. ఇంకా వందలమంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.
గిరిజన కుటుంబాన్ని రక్షించిన రెస్క్యూ టీమ్
కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కె.హాషిస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారులు తెలిపిన వివరాల మేరకు, ఇంకా అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నా సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకొని ఉండడాన్ని బృందం గమనించింది. వారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్నారు.
అక్కడ పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకొని ఉండగా వారిని రక్షించారు. కాగా వారు కొద్దిరోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి పోయి ఉన్నారని రెస్య్కూ అధికారి తెలిపారు. దీంతో తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించామన్నారు. తమతో రావాల్సిందిగా వారిని కోరగా ఆ కుటుంబం నిరాకరించిందని, సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఎంతో బతిమాలగా వారి తండ్రి ఒప్పుకున్నారని తెలిపారు. పిల్లలు ఇద్దరినీ తమ శరీరాలకు కట్టుకొని తాళ్ల సహాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకు తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. అనంతరం వారిని అత్తమాల యాంటీ-పోచింగ్ కార్యాలయానికి తరలించినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వారు అక్కడ సురక్షితంగా ఉన్నారన్నారు. వర్షాలు తీవ్రరూపం దాల్చడంతో అటవీశాఖ వాయనాడ్‌లోని అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన తెగలకు చెందిన చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
రెస్క్యూ బృందానికి కేరళ సీఎం ప్రశంసలు
రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. సహాయక బృందాన్ని కొనియాడారు. ‘‘వయనాడ్‌లో నెలకొన్న బీభత్సంలో అటవీ అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెస్క్యూ బృందం 8 గంటలపాటు శ్రమించి, ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను కాపాడింది. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం.. పునర్నిర్మించుకుందాం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
#WayanadLandslide
— Veena Jain (@DrJain21) August 3, 2024
Team of Kerala Forest Officers Trekked deep down into the dense forest for 8 hrs & Saved 4 Tribal Toddlers & Mother who were hiding in a cave & starving from nearly 5 days
Salute to Real Heroes 🔥🫡#WayanadDisaster #Wayanad #Army
pic.twitter.com/mJ78gpRuzx