A Man Suicide In Kanpur : అత్యాచారానికి గురైన ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. కుమార్తెల మరణం తట్టుకోలేక బాలికల తండ్రి వారం రోజులకే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘటమ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు బాలికలు తమ కుటుంబంతో నివసిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. వారంతా పనికి వెళ్లిన క్రమంలో, ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న బాలికలపై దాడి చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో ఫొటోలు, వీడియోలు కూడా తీశారు. అనంతరం ఆ వీడియోలు, ఫొటోలు చూపించి బాధితులు బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన బాలికలు, ఫిబ్రవరి 29న సమీప పొలంలోని చెట్టుకు ఊరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
అయితే బాలికల మరణానికి కారణమైన ఇటుక బట్టీల కాంట్రాక్టర్, అతని బంధువులపై బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా గ్యాంగ్ రేప్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, పోక్సో చట్టం కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టి కాంట్రాక్టర్‌తో పాటు ఇద్దరి బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసును ఉపసంహరించుకోవాలని బాలికల తల్లిదండ్రులపై, కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. దీంతో బాలికల తండ్రి బుధవారం(మార్చి 6) ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
స్పందించిన ప్రియాంక గాంధీ
ఈ దారుణపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ ఘటన జరగడంపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. "బాధిత బాలికలకు న్యాయం చేయాలని కోరితే వారి కుటుంబాలను నాశనం చేయటం ఆనవాయితీగా మారింది. 'ఉన్నావ్', 'హత్రాస్' నుంచి ఈ కాన్పుర్ ఘటన వరకు ఇదే జరిగింది. లా అండ్ ఆర్డర్ అనేదేమీ లేని ఈ జంగిల్ రాజ్‌లో మహిళగా ఉండటం నేరంగా మారింది. రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలు ఏం చేయాలి, ఎక్కడి వెళ్లాలి" అని ఎక్స్ వేదికగా స్పందించారు.
3రోజులుగా ఫ్రెండ్ మృతదేహంతోనే- గదిలో సెంట్ కొడుతూ గడిపిన కుటుంబం- భయంతోనేనట!
చనిపోయిన పామును 'ఫ్రై' చేసి తిన్న ఇద్దరు చిన్నారులు- చివరకు ఏమైందంటే?