Kolkata Hospital Incident : కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఆర్జీ కర్ ప్రభుత్వ ఆస్పత్రిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన దాడిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. నిరసనల ముసుగులో 40 నుంచి 50 మంది దాడిలో పాల్గొన్నట్లు చెప్పారు. అత్యవసర వార్డుల్లో దాడి చేసిన అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించి లాఠీఛార్జ్ చేశారు.
'నేరం జరిగిన ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది లేదు'
ఈ దాడి వల్ల జూనియర్ డాక్టర్‌పై నేరం జరిగిన ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది లేదని పోలీసులు తెలిపారు. ఈ విషయమై అసత్యాలు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. వేర్వేరు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దుండగులను గుర్తించేందుకు ఆ దృశ్యాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగానే ఆస్పత్రిపై దాడి జరిగినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆరోపించింది. హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలిపింది.
న్యాయం చేస్తానన్న గవర్నర్
మరోవైపు, జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ప్రభుత్వాస్పత్రిని బంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ సందర్శించారు. ఆందోళన చేస్తున్న వైద్యులను కలిశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి కలిసి పనిచేద్దామని డాక్టర్లతో అన్నారు. గతరాత్రి అల్లరి మూకలు దాడి చేసిన అత్యవసర వార్డును గవర్నర్ ఆనందబోస్ పరిశీలించారు. దాడి జరిగిన తీరును సంబంధిత వర్గాలను అడిగి తెలుసుకున్నారు.
VIDEO | Kolkata doctor rape-murder case: Enraged protesters entered the emergency ward of RG Kar Hospital last night and vandalised the property. Morning visuals from the hospital.
— Press Trust of India (@PTI_News) August 15, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/zQUxwReogA
గుండాయిజానికి ముగింపు పలికేందుకు!
అంతకుముందు కోల్‌కతాలోని వేర్వేరు ప్రభుత్వ ఆస్పత్రులకు చెందిన 20 మంది వైద్యులు గవర్నర్ సీవీ ఆనందబోస్‌ను కలిశారు. ఆర్జీ కర్ ఆస్పత్రిపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని కోరారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమకు భద్రత కరవైందని మహిళా వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బంగాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో మహిళలు ఆందోళన చేస్తున్న వేళ ఈ దాడి జరిగినట్లు గవర్నర్‌కు తెలిపారు. వైద్యులకు తన పూర్తి మద్దతు ఉంటుందన్న గవర్నర్ సీవీ ఆనందబోస్, రాష్ట్రంలో గుండాయిజానికి ముగింపు పలికేందుకు ఈ అంశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లనున్నట్లు హామీ ఇచ్చారు.
అభయ హోం స్టార్ట్
అభద్రతాభావంతో ఉన్న వైద్యుల కోసం అభయ హోం ప్రారంభించినట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది. బంగాల్‌లో స్వేచ్ఛగా తిరగగలమనే నమ్మకం కుదిరేవరకు అక్కడ ఉండొచ్చని పేర్కొంది. అభయ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. బాధలో ఉన్న వైద్యులు కానీ, పౌరులు కానీ సహాయం కోసం ఈ పోర్టల్ ద్వారా సంప్రదించవచ్చని వెల్లడించింది.
'ఆమె' బాడీలో 150మిల్లీ గ్రాముల వీర్యం! వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా? - Kolkata Doctor Case