Credit Card Limit Decrease : క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్! చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు తమ యూజర్ల క్రెడిట్ లిమిట్లో కోతలు విధిస్తున్నాయి. ఓ యూజర్ క్రెడిట్ లిమిట్ రూ.8లక్షల నుంచి ఏకంగా రూ.20వేలకు పడిపోయింది. దీనిపై ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలేమైందంటే?
Credit Card Companies Slashing Limits : స్కేపియా అనే క్రెడిట్ కార్డ్ కంపెనీ ఈ వారం అనేక మందికి షాక్ ఇచ్చింది. చాలా మంది యూజర్ల క్రెడిట్ లిమిట్‌ను తగ్గించింది. ఫెడరల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ వంటి దిగ్గజ బ్యాంకులతో కలిసి స్కేపియా సంస్థ క్రెడిట్ కార్డులు జారీ చేస్తోంది. తమ యూజర్లకు ఇప్పటివరకు ఉన్న ఫీచర్లను ఈ సంస్థ పునఃపరిశీలిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు సైతం తమ యూజర్లకు షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్న వారికి ఎయిర్పోర్ట్ లాంజ్ ఉపయోగించుకునే సదుపాయంలో, రివార్డ్ పాయింట్ల నిబంధనల్లో మార్పులు చేసింది. ఐసీఐసీఐకి చెందిన 21 రకాల క్రెడిట్ కార్డులకు సవరించిన ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్తించనున్నాయి. ఇటీవల చాలా క్రెడిట్ కార్డుల సంస్థలు ఇలా తమ ఆఫర్లను తగ్గించుకుంటున్నాయి.
కారణం ఏంటి?
ప్రస్తుతం క్రెడిట్ కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా వచ్చిన మార్పుల వల్ల ఈ కంపెనీలు ప్రభావితమవుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా విమానాశ్రయాల్లో లాంజ్ సౌకర్యాలు కల్పించడం ఈ కంపెనీలకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ కంపెనీలు తమ సేవల విషయంలో పునరాలోచన చేస్తున్నాయి. వ్యాపార దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటున్నాయి.
ద్రవ్యోల్బణం సమయంలో కస్టమర్ల డిమాండ్‌కు తగ్గట్టుగా సేవలు అందించడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి క్రెడిట్ కార్డ్ కంపెనీలు. తీవ్రమైన పోటీ ఓ కారణమైతే- మరికొన్ని కంపెనీలు లాభాలను పెంచుకోవడానికి సేవల్లో కోత పెడుతున్నాయి. డిజిటల్ పేమెంట్లలో వృద్ధి కారణంగా క్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో రివార్డు ప్రోగ్రామ్‌లను పునఃపరిశీలన చేసుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి.
Credit Card Lounge Access Rules : కరోనా అనంతరం పెరిగిన ప్రయాణాల వల్ల విమానాశ్రయాల్లో లాంజ్‌ల వాడకం ఎక్కువైపోయింది. క్రెడిట్ కార్డ్ యూజర్లు ఎక్కువగా లాంజ్‌లు వినియోగించుకోవడం వల్ల ఆ కంపెనీలపై భారం పెరుగుతోంది. దీంతో ఆఫర్లు, వ్యాపార సుస్థిరత మధ్య సమతుల్యం పాటించేందుకు కంపెనీలు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
క్రెడిట్ కార్డును 'చక్కగా' వాడేస్తున్నారు!
మరోవైపు, యూజర్లు తమ క్రెడిట్ కార్డులను ఉపయోగించుకునే విధానంలోనూ మార్పులు వచ్చాయి. క్రెడిట్ కార్డ్ యూజర్లను కంపెనీలు మూడు వర్గాలుగా విభజిస్తాయి. వారిని ట్రాన్సాక్టర్లు, రివార్వర్లు, ఈఎంఐ యూజర్లుగా పిలుస్తారు. ట్రాన్సాక్టర్లు క్రెడిట్ బిల్లింగ్ సైకిల్ ముగిసేలోపే పెండింగ్ మొత్తాన్ని చెల్లిస్తుంటారు. ఈఎంఐ యూజర్లు నెలనెలా బిల్లులు చెల్లించుకుంటారు. రివార్వర్లు తమ క్రెడిట్ కార్డుపై అధిక భారం వేస్తుంటారు. క్రెడిట్ కార్డ్ బిల్లులపై ఎక్కువ వడ్డీలు చెల్లించేది వీరే. సంప్రదాయంగా క్రెడిట్ సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టే బ్యాచ్ రివార్వర్లే. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తక్కువ వడ్డీకి వ్యక్తిగత లోన్లు తీసుకొని మరీ యూజర్లు తమ క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించేస్తున్నారు. దీంతో క్రెడిట్ కార్డ్ కంపెనీలకు వడ్డీ ఆదాయం బాగా పడిపోయింది.
అత్యవసరంగా రుణం కావాలా? సిబిల్ స్కోర్ లేకున్నా లోన్ పొందండిలా!
భవిష్యత్‌లో కోతలు ఉంటాయా?
సేవలపై పడుతున్న ద్రవ్యోల్బణం భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీలు సమీప భవిష్యత్‌లో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రివార్డులు పొందేందుకు అర్హతను పెంచడం వంటి చర్యలు తీసుకోవచ్చు. లాంజ్ సేవలు పొందడానికి క్రెడిట్ కార్డ్ ద్వారా ఖర్చు పెట్టాల్సిన లిమిట్‌ను పెంచే అవకాశం ఉంది. రివార్డ్ పాయింట్ల బదిలీ రేటును మార్చే అవకాశం కనిపిస్తోంది.
అమెజాన్ యూజర్లకు గుడ్ న్యూస్ - డబ్బులు లేకున్నా షాపింగ్ చేసే అవకాశం - ఎలా అంటే?