భూకబ్జాలు, కూల్చివేతలు..
1995లో పంచాయతీగా ఏర్పడిన జవహర్‌నగర్...ఇటీవల నగరపాలక సంస్థగా ఏర్పడింది. కార్పొరేషన్‌లో 28 డివిజన్లు ఉండగా... వార్షిక ఆదాయం 12 కోట్లు వస్తోంది. గతంలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుతోపాటు... భూకబ్జాలు, కూల్చివేతలతో తరచూ వార్తల్లోకెక్కింది. ఈ నగరపాలక సంస్థలో వలస ఓటర్లే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. అనేక ప్రభుత్వాలు మారినా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలోని ప్రజల బతుకులు మారలేదు. డంపింగ్‌యార్డు నుంచి వెలువడుతున్న విష రసాయనాలతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. వాతావరణం కాలుష్యమై పోవడం వల్ల చుట్టుపక్కల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. వ్యర్థాల వల్ల వచ్చే దుర్గంధం వల్ల కాలనీల్లోకి వెళితే ముక్కుమూసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషరసాయనాల వల్ల నీరు కలుషితమై రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం జ్వరాలతో పాటు... దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతున్నారు.
మురికి కాలువలు..పేరుకుపోయిన చెత్తాచెదారం
నగరపాలక సంస్థలోని పలు కాలనీల్లో మురుగు కాలువలు లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెత్తచెదారం పేరుకుపోయింది. మురికి కాలువలు లేక నీరు నిలిచి...దోమలు, ఈగలు పెరిగిపోయాయి. కార్పొరేషన్‌లో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. దూర ప్రాంతాలనుంచి నీటిని తెచ్చుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజులకోసారి నల్లాలు రావడం వల్ల... నీళ్ల కోసమే అధికంగా వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.