తెలంగాణ

telangana

'మిల్లుల్లో తనిఖీలు వాయిదా వేయండి'- కేంద్రానికి రాష్ట్రం లేఖ

By

Published : Jun 9, 2021, 10:24 AM IST

మిల్లుల్లో తనిఖీలు వాయిదా వేయాలని కేంద్రానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది. ఒకపక్క ధాన్యం సేకరణ కొనసాగుతుండగా.. నిల్వల తనిఖీ సరికాదని, ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయిపోయిన తరువాత చేపట్టాలని కోరింది. తనిఖీల నేపథ్యంలో ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ నిలిపివేతతో ఎక్కడి బియ్యం అక్కడే నిలిచిపోయాయి.

state government letter to central to stop inspection in mills
state government letter to central to stop inspection in mills

మిల్లర్ల నుంచి బియ్యం సేకరణను ఎఫ్‌సీఐ నిలిపివేసింది. మంగళవారం నుంచి మిల్లుల్లో బియ్యం, ధాన్యం నిల్వలపై తనిఖీ చేపట్టిన నేపథ్యంలో అధికారుల మౌఖిక ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టింది. ఒకపక్క ధాన్యం సేకరణ కొనసాగుతుండగా.. నిల్వల తనిఖీ సరికాదని, ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయిపోయిన తరువాత చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంగళవారం కేంద్రానికి లేఖ రాసింది. గత వానా కాలంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇచ్చే ప్రక్రియ సాగుతోంది. ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ నిలిపివేతతో ఎక్కడి బియ్యం అక్కడే నిలిచిపోయాయి. ఎఫ్‌సీఐ గోదాముల వద్ద బియ్యం లారీలు వరస కట్టాయి. తనిఖీ ప్రక్రియ వారం రోజులు సాగనుంది. అప్పటి వరకు బియ్యం తీసుకోకపోతే తాము ఇబ్బందులు పడతామని మిల్లర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

‘‘రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ చివరి దశలో ఉంది. 80 లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తుందని అంచనా వేశాం. ఇప్పటికే 80.60 లక్షల టన్నుల కొనుగోలు చేశాం. మొత్తం కొనుగోళ్లు 88 లక్షల టన్నులకు చేరవచ్చని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద లక్ష మెట్రిక్‌ టన్నులు, మిల్లులకు రవాణాలో మరో మూడు లక్షల మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి. ఇంకా కొన్ని లక్షల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయి నిల్వల్ని తనిఖీ చేసి, ఆ లెక్కల ప్రకారమే బియ్యం తీసుకుంటామంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. త్వరలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుంది. జులై 1 నుంచి తనిఖీ చేపట్టాలి’’ అని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ కేంద్ర ఆహార పౌరసరఫరాల మంత్రిత్వశాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి వర్తమానం రాకపోవడంతో తనిఖీ నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌సీఐ అధికారులు చెబుతున్నారు.

ప్రతి సీజనులో మిల్లర్లు ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వడంలో అనూహ్య జాప్యం జరుగుతోంది. గడువు పొడిగించాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. 2019లో కేంద్రం ఈ గడువుని 6 నెలలు పొడిగించింది. 2020లో 4 నెలలు పొడిగించింది. ఇంకా గడువు పొడిగించాలని రాష్ట్రం లేఖలు రాస్తూనే ఉంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి తనిఖీలకు కేంద్రం ఎఫ్‌సీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:కన్నతల్లి కర్కషత్వం.. కుమారున్ని కొట్టి చంపిన వైనం

ABOUT THE AUTHOR

...view details