'X' ప్లాట్‌ఫామ్‌ను బహిష్కరించిన బ్రిటీష్ మీడియా సంస్థ - ఎందుకంటే?
Published : Nov 13, 2024, 10:04 PM IST
Guardian Will No Longer Post On X : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ను బహిష్కరిస్తున్నట్లు బ్రిటన్ మీడియా సంస్థ ‘ది గార్డియన్’ పేర్కొంది. ఎక్స్ (గతంలో ట్విటర్) వేదికలో ఇకపై ఎటువంటి పోస్టులు పెట్టబోమని ప్రకటించింది. ఈ మాధ్యమంలో జాత్యహంకారం, కుట్రలతోపాటు కలవరపరిచే అంశాలు కనిపిస్తున్నాయని, అందుకే ఈ వేదికకు దూరంగా ఉండనున్నట్లు పేర్కొంది. బ్రిటన్‌లో పేరొందిన ‘ది గార్డియన్’ మీడియా సంస్థకు ఎక్స్‌లో ఏకంగా 1.07 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే కొంతకాలంగా ఈ వేదికలో ఆందోళన కలిగించే అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు ది గార్డియన్ తాజాగా పేర్కొంది. మొత్తంగా చూస్తే ఈ వేదికలో ప్రయోజనాల కంటే, ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. ది గార్డియన్ నిర్ణయంపై ఎక్స్ అధినేత మస్క్ స్పందిస్తూ, అవన్నీ అసంబద్ధమైనవన్నారు. అమెరికా ప్రభుత్వంలో మస్క్ కీలక బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.