'కశ్మీర్‌పై ఏకపక్ష చర్యలు అంగీకరించేది లేదు' - చైనా, పాక్ సంయుక్త ప్రకటన
Published : Jun 9, 2024, 10:18 AM IST
China Pakistan On Kashmir: దక్షిణాసియాలోని వివాదాస్పద అంశాల పరిష్కారంలో ఏకపక్ష చర్యలను అంగీకరించమని చైనా, పాకిస్థాన్ ప్రకటించాయి. ఈ మేరకు రెండు దేశాలు కలిసి శనివారం ఒక ప్రకటనను విడుదల చేశాయి. 'రెండు దేశాలు దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపన ప్రాధాన్యాన్ని గమనంలో ఉంచుకుని వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఏకపక్ష చర్యలను అంగీకరించేది లేదు' అని ప్రకటనలో పేర్కొన్నాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాలుగు రోజుల చైనా పర్యటన ముగింపు సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. జమ్ముకశ్మీర్‌లోని తాజా పరిస్థితులను గురించి చైనా నేతలకు పాకిస్థాన్ వివరించింది. ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకున్న తమ సూచనను చైనా పునరుద్ఘాటించింది.