Naxalites Fake Currency Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో నక్సలైట్లు ముద్రించిన నకిలీ నోట్లను తొలిసారి పెద్దమొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మాత్రం వెల్లడించలేదు. కొరాజ్‌గుడ గ్రామంలో నకిలీ కరెన్సీ వ్యవహారం వెలుగుచూసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ నోట్లను బస్తర్‌లో నిర్వహించే స్థానిక మార్కెట్‌లలో గిరిజనులను మోసగించి నక్సల్స్ మారుస్తున్నట్లు చెప్పారు.
నకిలీ కరెన్సీతో గిరిజనులకు మావోల మోసం- పెద్దఎత్తున డబ్బులు స్వాధీనం
Published : Jun 23, 2024, 9:53 PM IST
నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నారన్న తెలియడం వల్ల సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ సహా జిల్లా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. తమ రాకను ముందే పసిగట్టిన నక్సల్స్, వస్తువులను వదలి దట్టమైన అడవిలోకి పారిపోయినట్లు వెల్లడించారు. ఘటనాస్థలిలో రూ.50, రూ.100, రూ.200, రూ.500 విలువ కలిగిన నకిలీ నోట్లు, ప్రింటింగ్ పరికరాలు, ఇన్వర్టర్, సీరా బాటిళ్లు, తొమ్మిది ప్రింటర్ రోలర్లు, ఆరు వైర్‌లెస్ సెట్లు, తుపాకులు, బ్యాటరీలు, భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.