టీడీపీ ర్యాలీలో వైఎస్సార్సీపీ కార్యకర్తల కవ్వింపు చర్యలు - YSRCP provocative actions
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 9:56 PM IST
YSRCP Provocative Actions at TDP Rally: 'మేం అధికార పార్టీకి చెందిన వాళ్లం, ఏం చేసినా చెల్లుతుందనే' భావనలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అందుకే తమకు అడ్డుఅదుపు లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాల్సిన నేతలు సైతం ప్రత్యర్థి పార్టీలపై దాడులకు తెగబడుతుంటే, చూస్తూ ఆనందిస్తున్న ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.
పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగడాలు హెచ్చుమీరాయి. పట్టణంలో నిర్వహించిన తెలుగుదేశం ర్యాలీలో అధికార పార్టీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. ఎన్ఎస్పీసీ కాలనీ వద్ద మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన అనుచరులతో వచ్చారు. అదే సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ అటు రాగా, వైఎస్సార్సీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. ఇరు పార్టీల కార్యకర్తలు సవాళ్లు చేసుకున్నారు. వివాదం ముదరడంతో ఒక్కరిపైకి ఒక్కరు దూసుకెళ్లారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఏకంగా పెద్ద పెద్ద కర్రలు తీసి దాడి చేసేందుకు యత్నించారు. దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు వైఎస్సార్సీపీ అడ్డుకున్నారు. పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులను నిలువరించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ముందుకు పంపించడంతో వివాదం సద్దుమనిగింది.