ఓటర్లకు చీరలు - తీసుకోకపోతే పథకాలు కట్ - విశాఖలో ఎంపీ హుకుం! - MVV Satyanarayana
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 12:40 PM IST
|Updated : Feb 27, 2024, 1:30 PM IST
YSRCP MP MVV Satyanarayana Sarees Distribution: ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే అధికార వైసీపీ నేతలు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్లమెంట్ సభ్యుడు, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎంవీవీ సత్యనారాయణ ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళా ఓటర్లే లక్ష్యంగా తాయిలాలు ఎరవేస్తున్నారు.
ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎంవీవీ 3వ, 10వ వార్డులో ప్రచారం చేశారు. ఈ సమయంలో మహిళలకు చీరలను తాయిలాలుగా పంచారు. సిద్ధం అని ముద్రించిన ప్లాస్టిక్ కవర్లో చీరలను మహిళలకు అందించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని సైతం ఎంవీవీ ఏర్పాటు చేసుకున్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు అందించడానికి చీరల కోసం ప్రత్యేకంగా ఒక భారీ గోడౌన్ను కూడా తెరిచారు. నిత్యం ఎంవీవీ ఎక్కడ పర్యటిస్తూ ఉంటారో ఆ ప్రాంతాలకు వాహనాల ద్వారా వెళ్లి వారికి చీరలను పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలు ఇంకా మొదలవకుండానే తాయిలాలిచ్చి ఓటర్లను ప్రభావితం చేయాలని ఎంవీవీ సత్యనారాయణ ఈ చర్యలకు పాల్పడుతున్నారు. వీటిని వ్యతిరేకించినా, సహకరించపోయినా వారిని గుర్తించి, వాలంటీర్ల ద్వారా పథకాలు నిలుపు చేయాలని హుకుం జారీ చేసినట్టు వైసీపీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.