సజ్జల భార్గవ్ రెడ్డిపై సీఐడీ కేసు నమోదు - చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం - CASE ON SAJJALA BHARGAV REDDY
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 9:12 AM IST
YSRCP Leader Sajjala Bhargav Reddy Registered CID Case : వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ విభాగం ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వనివ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ ఇలాంటి చర్యలు ఎన్నికల ప్రవర్తనా నిమయావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
సజ్జల భార్గవ్ రెడ్డి అసత్య ప్రచారాలపై చట్టపరంగా కేసు నమోదు చేయాలని సీఐడీని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్ విత్ 120-బీ సెక్షన్ల ప్రకారం సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా అధికార పార్టీకి లబ్ధి చేకూర్చాలని సజ్జల భార్గవ్‌రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని వర్ల రామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య తన ఫిర్యాదులో సీఈవోను కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే భార్గవ్‌రెడ్డిపై కేసు నమోదైంది.