ఎర్రచందనం అక్రమాలపై డ్రోన్లతో నిఘా - స్మగ్లర్లకు సహకరిస్తే పీడీ యాక్ట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago
Red Sandalwood Protection Actions in kadapa : వైఎస్సార్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో ఉన్న అరుదైన ఎర్రచందనం సంపద కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖ అధికారి వినీత్‌కుమార్ తెలిపారు. ఎర్రచందనం అటవీ ప్రాంతంలో డ్రోన్లను ఉపయోగించి సాంకేతికంగా నిఘా పెట్టడమే కాకుండా జియో ట్యాగింగ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని బడా స్మగ్లర్లకు జిల్లాలోని కొందరు స్థానికులు అందిస్తున్న సహకారంపై నిఘా పెడుతున్నామని కడప డీఎఫ్ఓ వినీత్ కుమార్ తెలిపారు.
కడప జిల్లాలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో సూమారు 30 శాతం వరకు ఎర్రచందనం మొక్కలు ఇక్కడే ఉన్నాయని వెల్లడించారు. అంతార్జాతీయ మార్కెట్లో ఎర్రచందనానికి ఉన్న విలువ వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు అక్రమంగా వీటిని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారని వివరించారు. ఎటువంటి తప్పిదాలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టుబడిన స్మగ్లర్లను అరెస్ట్ చేసి కోర్టులకు పంపిస్తున్నామన్నారు. అలాగే వారిపై ఎప్పటికీ నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు. వాళ్లకు సహకరించిన స్థానికులపై పీడీ యాక్ట్ కేసు కూడా పెడుతున్నామని డీఎఫ్ఓ వెల్లడించారు.