ఫిబ్రవరి 5నుంచి వైఎస్ షర్మిల రాజీవ్ పల్లెబాట కార్యక్రమం : రఘువీరారెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 8:18 AM IST
YS Sharmila Starts Rajeev Palle Bata Program : శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఫిబ్రవరి 5న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజీవ్ పల్లెబాట ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి (Raghuveera Reddy) తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం పేరుతో షర్మిల ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్న చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్ షో, బహిరంగ సభలను మడకశిర నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రఘువీరారెడ్డి పార్టీ కార్యకర్తలతో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సీఎ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతుకు అన్యాయం చేస్తుందని, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటూ రాజకీయంగా షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంత హీనమైన చర్యని రఘువీరారెడ్డి విమర్శించారు. సొంత చెల్లెపై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే జగన్ మౌనం వహించడం, అందుకు ప్రోత్సహిస్తున్నట్లు ఉందని అన్నారు. ఒకే కుటుంబంలో పలు పార్టీలో ఉన్న వారు చాలామంది ఉన్నారు. ఎవరెవరు వ్యక్తిగతంగా విమర్శలకు పోలేదంటూ దుయ్యబట్టారు. బీజేపీ పాలన పదేళ్లుగా రాష్ట్రాన్ని మోసం చేసిందని, ఈసారి జరిగే చిట్ట చివరి పార్లమెంట్ సమావేశాల్లోనైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలనే డిమాండ్లతో షర్మిల రాజీవ్ పల్లెబాట ప్రారంభిస్తున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు