Is thirst a good predictor of dehydration : మానవ శరీరంలో మూడింట రెండొంతులు నీరే ఉంటుందని పలు పరిశోధనలు నిరూపించాయి. దేహంలోని అన్ని కణాలూ పనిచేయటానికి నీరు అవసరం. లాలాజలం, రక్తం, మూత్రం, చెమట వంటి అన్ని ద్రవాలకూ నీరే ఆధారం. అందువల్ల తగినంత నీరు తాగటం ముఖ్యం. నీరు లేకుండా కొన్ని రోజులు మాత్రమే మనిషి బతకగలడు. అయితే ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆవిరి రూపంలో, చెమట, మూత్రవిసర్జన ద్వారా మనం శరీరంలోని నీటిని కోల్పోతాం. అందుకే శరీరంలోని నీటి స్థాయిలను నియంత్రించడానికి, నిర్వహించడానికి శరీరం ఒక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. దాని ద్వారా మానవ శరీరంలోని ఫ్లూయిడ్ లాస్‌ను సమతుల్యం చేస్తూ, నీరు తాగమని ప్రేరేపిస్తుంది. అప్పుడు నోరు పొడిబారి నీరు అవసరం అనే భావన కలుగుతుంది. దాన్నే దాహం అంటారు.
దాహం ప్రాథమిక శారీరక మెకానిజం. మెదడు కంట్రోల్ సెంటర్‌గా పిలిచే హైపోథాలమస్, ఈ మెకానిజాన్ని నియంత్రిస్తుంది. అందులో భాగంగా శరీరంలోని వివిధ ప్రాంతాల నుంచి సిగ్నల్స్‌ను రిసీవ్ చేసుకుంటుంది. వాటికి ప్రతిగా- దాహం సెన్సేషన్‌ను కలిగించడానికి హార్మోన్స్‌ను విడుదల చేస్తుంది.
డీహైడ్రేషన్ అంటే ఏమిటి?
హైడ్రేటెడ్‌గా ఉండటం అంటే మన శరీరంలో తగినంత నీరు ఉండటం అని అర్థం. మనం తీసుకున్న నీటి కన్నా ఎక్కువ ఫ్లూయిడ్ లాస్ అయితే శరీరంలో నీటి సమతుల్యత దెబ్బతిని డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఫ్లూయిడ్ లెవెల్స్‌లో స్వల్పంగా తగ్గుదల ఉన్నా- తలనొప్పి, బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలిక డీహైడ్రేషన్ సమస్య ఉంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మలబద్ధకం, కిడ్నీల్లో రాళ్లు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. శరీరంలో ఈ కింద చర్యలు సక్రమంగా జరగాలంటే హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం:
- చెమట, శ్వాస తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం
- కీళ్లను, కళ్లను ల్యూబ్రికేట్ చేయడం
- ఇన్ఫెక్షన్లను నివారించడం
- పోషకాలను అబ్సార్బ్ చేయడం, జీర్ణక్రియ సరిగా జరగడం
- మూత్ర పిండాల ద్వారా వ్యర్థాలను బయటకి పంపడం
- మలబద్దకాన్ని నివారించడం
- మెదడు పనితీరు కోసం(జ్ఞాపకశక్తి- ఏకాగ్రత)
- మూడ్, ఎనర్జీ లెవెల్స్‌ను ఉంచడం
- శారీరక పనితీరు
- చర్మ ఆరోగ్యం
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
శరీరాన్ని హైడ్రేడెట్‌గా ఉంచడానికి దాహం వేయడం చాలా ఉపయోగపడుంది. అయితే దాహం వేయడం, తర్వాతి ఫ్లూయిడ్ ఇన్‌టేక్- హైడ్రేషన్ స్థాయిలతో సమానంగా ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి.
ఫ్లూయిడ్ ఇన్‌టేక్, హైడ్రేషన్ స్టేటస్‌పై- దాహం చూపించే ప్రభావంపై ఇటీవల పరిశోధన నివేదిక వెలువడింది. ఈ పరిశోధన కోసం కొందరు వాలంటీర్లు ల్యాబ్‌లో ఉదయం, మధ్యాహ్నం వారి మూత్రం, రక్తం, శరీర బరువు శాంపిల్స్ ఇచ్చారు. వీటిని పరిశీలించి చూస్తే- ఉదయం దాహం స్థాయిలు, మధ్యాహ్నం హైడ్రేషన్ స్టేటస్ మధ్య తక్కువ సంబంధం ఉందని తేలింది.
అంతేకాకుండా, నీరు అందుబాటులో ఉండటం వంటి అంశాలు కూడా దాహం వేయడానికి కారణాలు అయి ఉండవచ్చని పరిశోధన నివేదిక పేర్కొంది. దీన్ని తెలుసుకోవడం కోసం పరిశోధకులు కొందరిపై పరిశోధన చేశారు. ల్యాబ్‌లో నీరు అందుబాటులో ఉండటం వల్ల వాలంటీర్లు ఎంతమేర తాగుతున్నారు, వారు ఎంత హైడ్రేషన్‌గా ఉన్నారు అని పరిశీలించారు. ఈ పరిశోధనలో వాలంటీర్లు ఎంత దాహంతో ఉన్నారు, ఎంత హైడ్రేటెడ్‌గా ఉన్నారు అనే దాని మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉందిని తేలింది.
పురుషులు, మహిళల దాహంలో తేడా?
అయితే వారి హైడ్రేషన్ స్టేటస్‌తో సంబంధం లేకుండా పురుషుల కంటే మహిళలలే ఎక్కువగా దాహంగా ఉన్నట్లు ఫీల్ అయ్యారని ఈ పరిశోధనలు తేల్చాయి. మహిళలు తక్కువ ఫ్లూయిడ్ లాస్ ఉన్నప్పుడు కూడా దాహంగా ఫీల్ అయ్యారని చెప్పాయి. అంతేకాకుండా ఎక్కువ నీరు తాగి, ఎక్కువగా దాహంగా ఫీల్ అయ్యారని పరిశోధనలో తేలింది.
దాహం కాకుండా, శరీరానికి నీరు అవసరం అని చెప్పే ఇతర మార్గాలు ఇవే
1. మూత్రం రంగు : మూత్రం రంగు పేల్ ఎల్లో కలర్లో ఉండటం మంచి హైడ్రేషన్ స్థాయిలను సూచిస్తుంది. అదే ముదురు ఎల్లో, కాన్సెన్ట్రేడెట్ యూరిన్ ఉంటే డీహైడ్రేషన్ ఉందని అర్థం.
2. టాయిలెట్‌కు వెళ్లే ఫ్రీక్వెన్సీ : క్రమం తప్పకుండా(రోజుకు 4 నుంచి 6 సార్లు) మూత్ర విసర్జన చేస్తే శరీరం హైడ్రేడెట్‌గా ఉన్నట్లు. క్రమం తప్పితే డీహైడ్రేషన్‌ను సూచిస్తుంది.
3. స్కిన్ టర్గర్ టెస్ట్ : చర్మాన్ని(చేతి వెనుక భాగంలో) సున్నితంగా గిల్లి, చర్మం ఎంత త్వరగా దాని సాధారణ స్థితికి చేరుకుంటుందో గమనించాలి. నెమ్మదిగా చర్మం సాధారణ స్థికి వస్తే డీహైడ్రేషన్ ఉన్నట్లు అర్థం.
4. నోరు, పెదవులు పొడ బారడం : నోరు పొడిగా ఉండటం, పెదవులపై పగుళ్లు డీహైడ్రేషన్‌ను సూచిస్తాయి.
5. తలనొప్పి, అలసట : తరచుగా తలనొప్పి, తల తిరగడం, అలసట శరీరంలో మంచి హైడ్రేషన్ లేదని సూచిస్తుంది.
6. చెమట పట్టడం : ఫ్లూయిడ్ లాస్‌ను తగినంత నీరు తాగి భర్తీ చేయకపోవడం వల్ల ఎక్కువగా చెమట పడుతుంది. తద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.