'రాజ్యాంగం అంగీకరించదు' - ఎస్సీ వర్గీకరణపై గతంలో జగన్ వ్యాఖ్యలు - సోషల్ మీడియాలో వీడియో వైరల్ - Jagan on SC Classification - JAGAN ON SC CLASSIFICATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 2, 2024, 12:18 PM IST
Jagan on SC Classification : ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై గతంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం హోదాలో వైఎస్ జగన్ పలు వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగం అంగీకరించదని ఆయన అన్నారు. ఏదైనా చేసినా అది నిలబడదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో చంద్రబాబుపైనా ఆనాడు విమర్శలు గుప్పించారు.
ఎస్సీ వర్గీకరణను కోర్టు కొట్టేస్తుందని తెలిసీ చంద్రబాబు తీసుకు వచ్చారని జగన్ ఆనాడు అన్నారు. ఈ క్రమంలోనే కోర్టు కొట్టేసిందని చెప్పారు. వర్గీకరణ పేరుతో మాదిగ, మాలల మధ్య విభేదాలు తీసుకువచ్చి, ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు దీనిని తెచ్చారని పేర్కొన్నారు. ఇది చేయలేమని, రాజ్యాంగం ఇందుకు ఒప్పుకోదనీ తెలుసని చెప్పారు. ఏదైనా చేస్తే అది నిలబడదని, ఎవరైనా కోర్టుకు వెళితే దాన్ని కొట్టేస్తారనీ తెలిసినా, రాజకీయ లబ్ధి కోసం ఎస్సీల్లో చిచ్చుపెట్టి వర్గీకరణ తీసుకువచ్చారని తెలిపారు. దానివల్ల ఏం జరిగిందని ప్రశ్నించారు. కోర్టు కొట్టేసిందన్నారు. కోర్టు కొట్టేస్తుందని తనకు తెలియదా? తెలిసినప్పుడు ఎందుకు చేశారంటూ జగన్ విమర్శలు గుప్పించారు.