దారి విషయంలో బెదిరించిన వైసీపీ నేతలు-పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు - YOUNG MAN ATTEMPT TO SUICIDE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2024, 6:02 PM IST
Young Man Attempt to Suicide Due to YSRCP Leaders Harassment: ప్రజలు చిత్తుగా ఓడించినా వైఎస్సార్సీపీ నాయకుల ఆగడాలు ఏమాత్రం తగ్గలేదు. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ ప్రజలపై పెత్తనం చేస్తున్నారు. చెప్పినట్లు వినకుంటే బరితెగించి దాడులకు పాల్పడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం మారాలకు చెందిన టీడీపీ వర్గీయుడు మేకల గౌతమ్ వైఎస్సార్సీపీ దాడుల భయంతో ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం బెంగళూరు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంటి దగ్గర దారి గొడవలో గౌతమ్ తండ్రి మేకల నారాయణస్వామిపై ఇటీవల వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా దారి మధ్యలో అటకాయించిన వైఎస్సార్సీపీ నాయకులు రామ్మోహన్, గోపి కేసు పెడితే హతమరుస్తామని బెదిరించారు. వైఎస్సార్సీపీ హయాంలో క్షేత్ర సహాయకుడిగా ఉంటూ దందాలకు పాల్పడిన రామ్మోహన్ బెదిరింపులతో భయపడిన నారాయణస్వామి కేసు పెట్టకుండానే వెనుదిరిగారు. ఆ తర్వాత పీర్ల పండుగ రోజు కూడా గొడవ జరిగింది. వైఎస్సార్సీపీ దురాగతాలపై తీవ్ర ఆవేదన చెందిన గౌతమ్ తమకు న్యాయం జరిగే అవకాశం లేదంటూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.