వజ్రకరూరులో నీటి సంక్షోభం - పరిష్కారం కోసం రోడ్డెక్కిన మహిళలు - Women Protest highway
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 10:58 AM IST
Women Protest Drinking Water Problem in Anantapur District : తాగునీటి సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో 20 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో గుంతకల్లు - ఉరవకొండ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి ఆందోళన చేశారు.
తమ గ్రామంలో నీటి సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించ లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టడంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని మహిళలు పట్టుపట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చి రెండు రోజుల్లో నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.