Govt Gives Permission for Roads Construction in Tribal Villages: ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమం కింద 90 మారుమూల గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం పాలనా అనుమతులు జారీ చేసింది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ 76 రహదారి పనులకు రూ.275 కోట్లు ఖర్చు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా 5 ఏళ్ల పాటు రహదారి నిర్వహణ కోసం రూ.18.76 కోట్లు వెచ్చిచేందుకూ ఆనుమతి మంజూరు చేసింది. పీఎం జన్ మన్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం నుంచి రూ.163 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.111 కోట్లలను రహదారుల నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు.
90 పీవీటీజీ గ్రామాల్లో పీఎం జన్ మన్ కింద 76 రహదారి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గిరిజన ప్రాంతాల్లో పర్యటించి త్వరితగతిన మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.275 కోట్లతో పనులు చేపట్టేందుకు పాలనానుమతి జారీ చేసింది. ఈ మేరకు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
పవన్ కల్యాణ్ పర్యటన: గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి పలికేందుకే రహదారుల నిర్మాణం చేపట్టామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇటీవల అల్లూరి జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ పలు రోడ్ల నిర్మాణానికి, పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజనులకు కష్టాల్లో తోడుగా ఉన్నామని చెప్పటానికే మన్యం జిల్లాలో పర్యటిస్తున్నానని పవన్ చెప్పారు. మెత్తం 100 కి.మీ మేర 120 రోడ్లకు పవన్ శంకుస్థాపన చేశారు. డోలీ మోతలు లేని రాష్ట్రం దిశగా ముందుకెళ్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు.
డోలీ మోయడం అత్యంత బాధాకరం: ఈ రోజుల్లో కూడా డోలీ కట్టి నలుగురు మోయడం అత్యంత బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. గిరిజన యువత తలచుకుంటే వాళ్ల జీవితాల్లో మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు. 2000 గ్రామాలకు రోడ్లు లేవని దానికి రూ.2,849 కోట్లు అవుతుందని తెలిపారు. గిరిజన గ్రామాల రోడ్లకు ఏటా రూ.350 కోట్లు కేటాయిస్తామని మిగతా నిధులు కేంద్రం నుంచి తీసుకుని రోడ్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ, చిరుధాన్యాలు పండిస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఉన్నాయని ఇలా నా దృష్టికి ఎన్ని సమస్యలు వచ్చినా సీఎం చంద్రబాబుకు వివరిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
రామ్‌గోపాల్ వర్మకు బిగ్ షాక్ - మూడు నెలలు జైలు శిక్ష
పెట్టుబడుల వేటలో లోకేశ్ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు