మారని వాలంటీర్ల తీరు - అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా కార్యకలాపాలు - ఎన్నికల విధుల్లో వాలంటీర్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 7:55 PM IST
Volunteers Involving in Elections Related Works: ఓటర్ల జాబితాలో, ఎన్నికల విధుల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోవద్దని ఎన్నికల సంఘం ఎన్నిసార్లు హెచ్చరించినా వారి తీరు మారటం లేదు. అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా వాలంటీర్ల కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇద్దరు వాలంటీర్లు కులాలు, పార్టీల వారీగా ఓటర్ల వివరాలను సేకరిస్తుండగా నగరంలోని పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ సమీపంలో తెలుగుదేశం నేతలు గుర్తించారు. వారిని అడ్డుకుని ఎన్నికల విధుల్లో వాలంటీర్లకు ఏం సంబంధమని నిలదీశారు. వాళ్లు సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు.
అదే విధంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓటర్ల తుది జాబితా పరిశీలన మొత్తం వాలంటీర్ల పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. జాబితా తీసుకుని ఇంటింటికి వెళ్లి ఓటర్లకు సంబంధించిన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. బీఎల్వోలు చేయాల్సిన పని వాలంటీర్లు చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. వార్డు వాలంటీర్లు ఉదయాన్నే ఓటర్ల జాబితాతో కాలనీల్లో ప్రత్యక్షమవుతున్నారు. స్థానికులు వాలంటీర్లను ప్రశ్నించటంతో అక్కడి నుంచి జారుకున్నారు.