రాష్ట్రంలో జగన్ కొత్త కుట్ర- పక్కా ప్రణాళికతోనే టీడీపీ కార్యకర్తల హత్య : వర్ల రామయ్య - Varla sensational comments on jagan - VARLA SENSATIONAL COMMENTS ON JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 14, 2024, 7:57 PM IST
Varla Ramaiah Criticized Jagan Mohan Reddy : జగన్ మోహన్ రెడ్డి కొత్త కుట్రలో భాగంగానే పత్తికొండలో శ్రీనివాసులు అనే టీడీపీ నాయకున్ని దారుణంగా హత్య చేయించాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్రంలో కొన్ని హత్యలు చేయించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని చెప్పాలని అతని ప్రణాళిక అని ధ్వజమెత్తారు. కుట్రలతో జనాలను చంపి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడానికి జగన్ యత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీ వెళ్లి గగ్గోలు పెట్టిన జగన్ చనిపోయిన 33 మంది పేర్లు చెప్పమని అడిగితే అక్కడ దొంగకు తేలు కుట్టినట్లు కిమ్ముమనకుండా ఎందుకు ఉన్నాడని ఎద్దేవా చేశారు.
జగన్ రెడ్డికి దైర్యం ఉంటే 33 మంది పేర్లను ఇప్పుడే చెప్పాలని సవాల్ విసిరారు. రాయదుర్గంలో ఆదెప్పను, ఆళ్లగడ్డలో శ్రీదేవి, తాడిపత్రిలో లాల్ బాషా, పత్తికొండలో గోపినాథ్ చౌదరి, దుగ్గిరాలలో కాశీం నేడు మళ్లీ పత్తికొండలో శ్రీనివాస్ ఇలా తెలుగుదేశం కార్యకర్తలను వైఎస్సార్సీపీ నేతలు పక్కా ప్రణాళికతో హతమర్చింది నిజం కాదా? అని నిలదీశారు. జగన్ రెడ్డి 174 నియోజకవర్గాలకు డబ్బులు పంపి అరాచకం సృష్టించి అమాయకులను చంపాలని ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్రమంతటా కోడై కూస్తోందన్నారు.