గేదెలను తప్పించబోయి బస్సు బోల్తా- ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు - bus accident - BUS ACCIDENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 12:23 PM IST
Two Persons Dead in Road Accident at Prakasam District: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అమరావతి -అనంతపురం జాతీయ రహదారిపై గేదెలను తప్పించే క్రమంలో విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అనంతరం రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతులు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన శివయ్య, ప్రకాశం జిల్లా కలనూతలకు చెందిన విజయలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. అదే రహదారిపై కారులో గుంటూరుకు వెళ్తున్న వ్యక్తి ప్రమాదాన్ని గమనించి బస్సు అద్దాలను ధ్వంసం చేశాడు. బస్సులో చిక్కుకున్న కొంతమంది ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ అతి వేగంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.