Ganja Gang Thefts With Minors in Narasaraopet: పిల్లలకు గంజాయి అలవాటు చేసి చోరీలు చేయిస్తున్న ముఠా వ్యవహారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో వెలుగు చూసింది. ఈ ముఠా నుంచి రక్షించాలంటూ ఆ పిల్లల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అసలేం జరిగిందంటే
నరసరావుపేటలోని వరవకట్టకు చెందిన షారుక్, ఫరూక్లు మైనర్లకు డ్రగ్స్, గంజాయి అలవాటు చేస్తున్నారు. పిల్లలు దానికి బానిసలుగా మారిన తర్వాత సెల్ఫోన్ దొంగతనాలు చేయిస్తున్నారు. అంతేకాకుండా గంజాయి రవాణా సైతం చేయిస్తున్నారు. ఇలా చేసిన క్రమంలో రెండు నెలల క్రితం ఓ బాలుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో జువైనల్ హోంలో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు.
బాలుడు బయటకు వచ్చిన తర్వాత షారుక్, ఫరూక్లు మళ్లీ రంగంలోకి దిగారు. మళ్లీ దొంగతనాలు చేయాలంటూ బాలుడి వెంట పడుతున్నారు. వారి వేధింపులతో విసిగిపోయిన బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చోరీలు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని వారు వాపోయారు. ఏమీ తెలియని పిల్లలను టార్గెట్ చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారి చెర నుంచి తమ పిల్లలను కాపాడి తగిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు - కానిస్టేబుళ్లను ఢీ కొట్టి పరార్