భూమన కరుణాకరరెడ్డి తీసుకున్న నిర్ణయాలను అధికార వెబ్‌సైట్‌లో పెట్టిన టీటీడీ - TTD Key Decisions Upload in Website - TTD KEY DECISIONS UPLOAD IN WEBSITE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 5:22 PM IST
TTD Key Decisions Upload in Website: గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలక మండలిలో భూమన కరుణాకరరెడ్డి తీసుకున్న నిర్ణయాల తీర్మానాలను ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు అధికార వెబ్‌సైట్‌లో పెట్టించారు. 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు మొత్తం 8 బోర్డు సమావేశాలు జరగ్గా ఆ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. గత బోర్డు తీర్మానాలను ఇప్పటివరకు గోప్యంగా ఉంచడంపై ఇటీవల ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. వెంటనే భక్తులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంది.
పాలకమండలి నిర్ణయాలు పాదర్శకంగా భక్తులకు అందుబాటులో ఉంచాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి గత పాలక మండలి నిర్ణయాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే టీటీడీ ఐటీ విభాగం అధికారి సందీప్ రెడ్డిని తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి బదిలీ చేశారు. టీటీడీ ప్రతి విభాగంను ప్రక్షాళన దిశగా ఈవో శ్యామలరావు పని చేస్తున్నారు.