టీటీడీ ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు సమీక్ష - TTD EO Shyamala Rao Inspection - TTD EO SHYAMALA RAO INSPECTION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 17, 2024, 10:18 PM IST
TTD EO Shyamala Rao Conducted Inspections And Reviews: టీటీడీలోని అన్ని విభాగాల ఉన్నత అధికారులతో ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. తిరుమల్లోని గోకులం విశ్రాంతి భవనంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మంలతో భేటీ అయిన ఆయన శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. భక్తులు సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు. దర్శనం, వసతి, నాణ్యమైన అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను అత్యున్నతంగా అందించడం అందరి బాధ్యత అని ఈవో శ్యామలరావు అన్నారు.
ఆదివారం చేసిన తనిఖీల్లో భక్తుల నుంచి అందిన అభిప్రాయాలు, వారి అంచనాలను తెలుసుకున్నానన్న ఈవో వాటిని అందుకోవడానికి అందరం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విభాగంలో చెక్ లిస్ట్, టైమ్‌లైన్, ఫీడ్ బ్యాక్ యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లను సిద్ధం చేయాలని జేఈవోను ఆయన ఆదేశించారు. దర్శనం, ఆన్‌లైన్ కోటా విడుదల, ఆలయానికి సంబంధించిన సేవా టిక్కెట్లు, రిసెప్షన్ విభాగంలో వసతి విధానాలతో పాటు ఇంజినీరింగ్ పనులపై సంబంధిత అధికారులతో ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు.