వాహనాలకు లేని దారి - ఏడు కిలోమీటర్లు మృతదేహాన్ని మోసుకెళ్లిన బంధువులు - Tribals Problems in Agency Area - TRIBALS PROBLEMS IN AGENCY AREA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2024, 6:07 PM IST
Relatives Carried Dead Body on Shoulders 7 kilometers in Vizianagaram : ప్రభుత్వాలు మారినా, పాలకులు ఎవరైనా గిరిపుత్రుల తలరాతలు మాత్రం మారడం లేదు. ముఖ్యంగా ఏజెన్సీలోని గిరి శిఖర గ్రామాల్లోని గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కనీస రహదారి సౌకర్యం లేక శతాబ్దాల తరబడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం.
ప్రభుత్వాలు మారినా గిరిపుత్రులకు డోలీ మోతలు మాత్రం తప్పడం లేదు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం డి.కొండపర్తి గిరి శిఖర గ్రామానికి చెందిన గేదెల రాజారావు విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి కుటుంబ సభ్యులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. వాహనాలు వెళ్లలేని రహదారిలో సుమారు 7 కిలోమీటర్లు డోలీ కట్టి మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది. డి.కొండపర్తి గ్రామానికి ప్రధాన మార్గమైన చిలకలగెడ్డపై బ్రిడ్జి నిర్మాణం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో ఈ పరిస్థితి వచ్చిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, తాటిపూడి వెనుక గ్రామాలకు బోటు సాదుపాయం కల్పించాలని అడిగినా చేయటం లేదని గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.