అనకాపల్లిలో ఎస్టీ కమిషన్కు నిరసన సెగ - డోలి మోతలతో స్వాగతం పలికిన గిరిజనులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 1:48 PM IST
Tribal People Protest Against ST Commission Team in Anakapally District : అనకాపల్లి జిల్లాలో ఎస్టీ కమిషన్ బృందానికి నిరసన సెగ తగిలింది. జిల్లాలో పర్యటిస్తున్న బృందానికి రోలుగుంట మండలం గిరిజన ప్రాంతం లోసంగిలో ఆదివాసీలు డోలిమోతలతో స్వాగతం పలికారు. తమకు సరైన రహదారి సదుపాయం, విద్య, వైద్యం, విద్యుత్ లేక ఏళ్ల తరబడి ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నాం అంటూ ఆదివాసీలు అధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు.
Anakapally District : రహదారి సౌకర్యం కల్పించాలని దశాబ్దాలుగా కోరుతున్నా అధికారులు, పాలక వర్గాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని గిరిజనులు నిరసన తెలిపారు. సరైన రోడ్డు సౌకర్యం లేక వైద్యం కోసం తరచూ డోలీ మోతలే గతి అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికి సకాలంలో వైద్యం అందకపోవడంతో గర్భిణీలు, బాలింతలు, శిశువులు మృత్యువాత పడుతున్నారంటూ వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ఎస్టీ బృందాన్ని కోరుకున్నారు. ఆదివాసీల సమస్యలపై సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు ఎస్టీ కమిషన్ బృందానికి విన్నవించారు.